తెలంగాణకు పెట్టుబడులతో రండి
భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం
సీఎం రేవంత్ రెడ్డి
టోక్యో
Let India and Japan work together to build a bright future for the world CM Revanth Reddy
తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు.
టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనేక అవకాశాలను సమగ్రంగా వివరించింది.
వివిధ రంగాలకు చెందిన 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ వ్యాపారవేత్తలను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు.
“భారతదేశంలోనే అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతూ మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నది. జపాన్ను ‘ఉదయించే సూర్యుడి దేశం’ అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తున్నది,” అని ఉద్ఘాటించారు.
“టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజల సౌమ్యత, మర్యాద, క్రమశిక్షణ నన్ను ఎంతగానో ఆకర్షించాయి. హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో టోక్యో నుంచి మేము చాలా నేర్చుకున్నాము,” అని పేర్కొన్నారు.
లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో నిధులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం గారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, స్థిరమైన విధానాలను అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం,” అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జపాన్లోని భారత రాయబారి సిబి జార్జ్రు మాట్లాడుతూ, భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను వివరించారు. జెట్రో (జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ, తెలంగాణతో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు