ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Let's build a plastic free society
బనగానపల్లె నంద్యాల జిల్లా డిసెంబర్.28:-
నేడు బనగానపల్లెలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా రాలి
మెగా ర్యాలీలో లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే, వారి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా.. ‘నా బనగానపల్లె – నా ఆరోగ్యం‘ పేరుతో నిర్వహించిన మెగా ర్యాలీలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా ర్యాలీకి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, యువకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఏ కే అనిల్ టీమ్ వాళ్లు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులు చేసిన నృత్యం అందరినీ అలరించింది.. వారిని ప్రోత్సహిస్తూ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి రూ. 10 వేలు వారికి బహుమతిగా అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ నా సతీమణి ఇందిరమ్మ ప్లాస్టిక్ రహిత కార్యక్రమం ప్రారంభించిన తొలినాళ్లలో ఎంత వరకు దీన్ని తీసుకెళ్లగమనే ఆలోచనలు ఉన్నప్పటికీ, ఆమె ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం ప్రతి మహిళకు ఇది ఎంతో స్పూర్తి ప్రదాయకమన్నారు. ఏదైనా కార్యక్రమం ప్రారంభించడం విజయవంతం చేయడం అంతా సులభం కాదని… మనకు ఎన్నైనా కోరికలు ఉండొచ్చు, కానీ ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమాన్ని కూడా ఏ ఒక్కరు, లేదంటే ఏ ప్రభుత్వం విజయవంతం చేయలేదన్నారు. ప్రజల సహకారం ఉన్నప్పుడే నా బనగానపల్లె – నా ఆరోగ్యం విజయవంతంమవుతోందన్నారు.. నేడు బనగానపల్లె ప్రజల్లో వచ్చిన మార్పు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. గతంలో మండీ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్లు ఎంతో గొప్పగా సహకరిస్తామని మాట ఇవ్వడంతో దీనికి తొలి అడుగు పడిందన్నారు.. గత రెండున్నర నెలలుగా బీసీ ఇందిరమ్మ, శ్రీనయ్య అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారని మంత్రి తెలిపారు. అలాగే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి సహకరించమని కోరినప్పుడు, వారంతా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు కూడా ఎంతో ఉత్సాహాంగా పాల్గొనడంతో పాటు, వారి తల్లిదండ్రుల్లో కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఏ కార్యక్రమైన విజయం సాధించాలంటే, మహిళల సహకారం అవసరమని మంత్రి అన్నారు. నేడు మహిళలంతా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని మీ ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్లెలో పర్యటించినప్పుడు, ఎక్కడికెళ్లినా, మురికికాల్వలు ప్లాస్టిక్ తో నిండిపోయి, రోడ్లపైకి చెత్త వచ్చే పరిస్థితి ఉందన్నారు.. ఇది ఎన్నిసార్లు తొలగించినా మళ్లీ, మళ్లీ వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. నేడు మన ఇంటిని మాదిరిగా, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే తపనతో పాటు మనకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. నేడు స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్లాస్టిక్ క్యాన్సర్ కారణభూతంగా మారిందని, గతంలో మనం ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనే మాట వినేవాళ్లం…. కానీ నేడు చాలా మంది మనకు తెలిసిన వాళ్లే క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు అనేకం చూస్తున్నామన్నారు. క్యాన్సర్ కు మూలమైన వ్రేళ్లు ప్లాస్టిక్ ను నిర్మూలించడం ద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఆస్పత్రులు, కాల్వలు, అపరిశుభ్రంగా ఉంటే ప్రజలు ప్రభుత్వాలు, నాయకులు, అధికారుల వద్దకు వెళతారన్నారు. కానీ ఈ సమాజం మనది… మనమే ఎందుకు మన పరిసరాలను శుభ్రం చేసుకోకూడదనే ఆలోచన రావడం లేదు.. ఇది నా గ్రామం, నాది అనే మన ఆలోచనలో మార్పు రావడం ద్వారానే ప్లాస్టిక్ వంటి వాటిని ఈ సమాజం నుంచి తరిమిగొట్టగలమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. బీసీ ఇందిరమ్మ చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరం.. ప్లాస్టిక్ నివారణ, పారిశుద్ధ్య నివారణ వంటి కార్యక్రమాలు చేపట్టడం చెప్పినంతా సులువు ఎంతమాత్రం కాదన్నారు. ఇది ప్రాక్టీకల్ గా చాలా కష్టంతో కూడుకున్నది.. సమాజంలో అందరినీ కలుపుకుని పోవాలి, అదే సమయంలో దీన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. అయితే ప్రతి ఒక్కరినీ ప్రేరేపించి, వారిలో ప్లాస్టిక్ పై అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలన్నా ఇందిరమ్మ గారి ఆలోచన చాలా గొప్పదన్నారు. ప్లాస్టిక్ వంటి వస్తువులను వాడి పారేసిన తర్వాత, వాటిని కాలిస్తే, ఆ పొగను పీల్చడం ద్వారా లంగ్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని చిన్నారులు ప్రదర్శించిన స్కిట్ లు ఎంతో సందేశాన్ని ఇస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ ను నివారించడంతో పాటు, పచ్చదనం పెంచాలన్న గొప్ప మెసేజ్ ఇవ్వడం గొప్ప నిర్ణయం అన్నారు. బీసీ ఇందిరమ్మగారు ఒక్కరిగా ప్రారంభించిన ఉద్యమం నేడు ఇంతమందిని ప్రేరేపించింది.. మనం ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మన మంచి భవిష్యత్తుకు పునాది అన్నారు. మనం అంతా కలిసి పనిచేస్తే, ఈ ప్లాస్టిక్ ను తరిమివేయడం ఏమాంత పెద్ద విషయం కాదని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ఎస్సీ అదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం కోసం మంచి సంకల్పం తీసుకున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలన్నారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, మన పట్టణాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ కూర్చొకుండా నేడు బీసీ ఇందిరమ్మగారు వేసి ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా నేడు బనగానపల్లెలో ఈ మార్పు కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు ప్లాస్టిక్ ను తీసుకొస్తే మేము తీసుకోమంటూ ఖచ్చితంగా చెప్పే విధంగా మనలో మార్పు రావాలన్నారు. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి – ఇందిరమ్మలు దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు.. ఇది నిర్ణయం తీసుకున్నంత ఈజీగా మాత్రం కాదు, అమలు చేయడంలో అనేక సమస్యలుంటాయన్నారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న మంత్రిగారికి ప్రజలంతా సహకరించాలన్నారు. ఇది మన భవిష్యత్తు కోసం.. మనం తీసుకున్న నిర్ణయమన్నారు. మన బనగానపల్లె స్పూర్తిగా ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో నంద్యాల జిల్లా… ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఆదర్శంగా తీసుకునే వరకు దీనిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బీ సీ ఇందిరమ్మ మాట్లాడుతూ… నా బనగానపల్లె నా ఆరోగ్యమే లక్ష్యంగా ప్లాస్టిక్ పై అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాల ద్వారా నేడు చాలా మంది విద్యార్ధుల్లో సైతం మార్పు కనిపిస్తోందన్నారు. నేడు ఏ స్కూల్ కు వెళ్లినా విద్యార్ధుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. విద్యార్ధులు.. తల్లిదండ్రులకు ప్లాస్టిక్ వినియోగించడం వల్ల వచ్చే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న విషయాలు విన్నప్పుడు నిజంగా ఈ కార్యక్రమం విజయవంతంమైందని భావించానన్నారు. నేడు ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తిని, ఆవులు, గెదేలు వంటి జంతువులు సైతం చనిపోయే పరిస్థితి నెలకొందన్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదున్నారు… గతంలో అతి స్పల్పంగా ఉన్న క్యాన్సర్ ఆస్పత్రులు, నేడు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయంటే, క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమేపీ భారీగా పెరుగుతుందని అర్ధం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి, క్లాత్ కవర్లు, బ్యాగులు వంటివి వినియోగించాలని ఆమె సూచించారు. ప్రతి నెలా ఒక్కో ఇంట్లో 1 కేజీ ప్లాస్టిక్ వస్తుందని, ఒక్క మన బనగానపల్లెలోనే 12 వేల నుంచి 17 వేల ఇళ్లులు ఉన్నాయని.. అంటే ప్రతి నెల 5 టన్నుల ప్లాస్టిక్ మన బనగానపల్లెలో వస్తోందన్నారు.. వ్యాపారస్తులు కూడా సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ ను వాడకుండా ఉండాలన్నారు.. సంక్రాంతి నుంచి బనగానపల్లెలో ప్లాస్టిక్ కనిపించకూడదనే నియమంతో మనమంతా కలిసికట్టుగా పనిచేయలన్నారు.. నేడు వ్యాపారస్తులు, షాపులు యాజమాన్యాలు సహకరిస్తున్నారన్నారు. తాజాగా బనగానపల్లెలో సహజసిద్ధంగా మొక్కజొన్న పిప్పితో తయారు చేసిన కవర్లు కూడా అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సహకరించాలన్నారు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాల్వలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు … బనగానపల్లె పట్టణాన్ని క్లీన్ చేయడానికి చుట్టు ప్రక్కల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి పారిశుధ్ధ్యంగా మార్చడానికి 2 – 3 నెలల సమయం పట్టిందని ఆమె తెలిపారు. అయినప్పటికీ తిరిగి మళ్లీ అదే విధంగా తీసుకొచ్చి కాల్వల్లో చెత్తను వేస్తే, అవి పేరుకుపోయే పరిస్థితి వస్తోందన్నారు.. కాబట్టి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే, బనగానపల్లె పరిశుభ్రంగా మారుతుందన్నారు.