సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలని.. పాలన చేతకాక తన మీద కారు కూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్‌లో.. కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. నీటి సమస్యలపై నల్గొండలో సభ పెడుదామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకుంటామని అంటున్నారని కేసీఆర్ కన్నెర్రజేశారు. అసలు సభను అడ్డుకోవడానికి ఆయన ఎవరు..? అని ప్రశ్నించారు.
ఎవరు అడ్డొస్తారో చూద్దాం..!
‘బీఆర్ఎస్ సభను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం. కోమటిరెడ్డి లాంటి వాళ్లను చాలా మందిని చూశాను. ప్రాజెక్టుల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొట్లాడుతారు.. ఇందులో సందేహాలు అక్కర్లేదు. నేను.. నేతలతో నల్గొండ వెళ్లి కొట్లాడుతాను. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఎన్నికల్లో సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు’ అని కేసీఆర్ హెచ్చరించారు


