- Advertisement -
19న మద్యం కొత్త పాలసీ నోటిఫికేషన్
Liquor New Policy Notification on 19
ఒకటి నుంచి అమల్లోకి లిక్కర్ విధానం
విజయవాడ, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే)
ఏపీలో ఈ నెల 19న కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18న జరిగే క్యాబినెట్ భేటీలో కొత్త మద్యం పాలసీపై చర్చించనున్నారు. అనంతరం నూతన మద్యం పాలసీపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త లిక్కర్ పాలసీని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి ఆన్ లైన్ లో లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది ప్రభుత్వం. వైసీపీ హయాంలో మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉంది. అటు ఇప్పటికే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తైంది. కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో కొత్త లిక్కర్ పాలసీపై పూర్తిస్థాయిలో చర్చించి, ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే దశలవారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు సీఎం చంద్రబాబు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై ఏపీ అధికారులు స్టడీ చేశారు.తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ ఏయే రకాల బ్రాండ్లు అమ్ముతున్నారు, ధరలు ఏ విధంగా ఉన్నా, మద్యం షాపుల నిర్వహణ ఎలా ఉంది తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. దీనిపై దశలవారిగా సీఎం చంద్రబాబు, మిగతా మంత్రుల సమక్షంలో చర్చలు జరిపారు. తర్వాత ఒక కొత్త మద్యం విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.ఈ నెల 18న మంత్రి మండలిలో కొత్త లిక్కర్ పాలసీపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత 19వ తేదీన నూతన మద్యం పాలసీకి సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం హయాంలో మద్యం పాలసీలో అమలు చేసిన విధివిధానాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో లాటరీ ద్వారా మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే విధానాన్ని చంద్రబాబు సర్కార్ తీసుకురానుంది. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది. ప్రభుత్వమే సొంత మద్యం బ్రాండ్లను తయారు చేసింది.అయితే, జగన్ ప్రభుత్వం.. గతంలో ఉన్న బ్రాండ్లను రద్దు చేసి, నకిలీ బ్రాండ్లు సృష్టించి, నకిలీ మద్యాన్ని సరఫరా చేయటం వల్ల రాష్ట్రంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే విధంగా విధానం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ తరహా విధానంపై దృష్టి సారించింది.
- Advertisement -