రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో జరిగిన భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులంతా సమిష్టిగా పనిచేసి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు మూడంచెల సమన్వయ కమిటీల వ్యవస్థను త్వరితగతిన ఏర్పాటు చేసుకుని సమిష్టిగా పని చేయాలన్నారు.
ఇటు డీసీసీ అధ్యక్షులు, అటు మండల, బూత్ స్థాయి కమిటీనూ సమన్వయం చేసుకుని పోల్ మేనేజ్‌మెంట్ పకడ్బందీగా నిర్వహించాలంటూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలకు సూచించారు. ప్రతి పది బూత్‌లను కలిసి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని, వంద రోజుల్లో ప్రభుత్వ పనితీరును, రాహుల్‌గాంధీ ప్రకటించిన పాంచ్‌న్యాయ్ గ్యారెంటీలను, పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఓటరు వద్దకూ వెళ్లి వివరించాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బూత్ కమిటీల్లో చురుకుగా పనిచేసిన వారికి గ్రామ వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికి పైగా వలంటీర్లతో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందులో మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తామని, రూ.6 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ నెల 21న భువగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం పెట్టుకుందామని, అక్కడే సభనూ నిర్వహిద్దామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానన్నారు. కాగా, మే నెల మొదటి వారంలో నల్లగొండ, చౌటుప్పల్‌లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ రోడ్‌షోలు ఉంటాయని తెలిపారు.