హైదరాబాద్, అక్టోబరు 30, (వాయిస్ టుడే ): తెలంగాణలో ఎన్నికల హీట్ రోజు రోజుకు మరింత పెరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అయా నియోజీకవర్గాల్లో తమదైన స్టైల్లో ప్రచారాలు చేసి సుడిగాలి పర్యటనలు చేస్తుండగా…కాంగ్రెస్ మాత్రం ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్,ప్రియాంక,డీకే శివకుమార్ లతో ప్రచారాలు చేపిస్తున్నారు.ఇదే క్రమంలో శనివారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో ప్రసంగిస్తూ బిసి నేతనే తమ సీఎం అభ్యర్థి అంటూ అమిత్శా ప్రకటించారు.కాగా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను తమ వైపు మలుచుకునేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం బీసీ నినాదంతో ముందుకు వస్తుందని తెలుస్తుంది.దానికి సంబంధించిన ప్రణాళికలు అన్ని ఇప్పటికే పార్టీ అగ్ర నాయకత్వం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే వచ్చే నెల హైదరాబాద్ లో ” బిసి గర్జన ” పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ కసరత్తు చేస్తుంది.ఈ సభకు నేరుగా ప్రధాని మోడీ రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే వచ్చే నెలలో మోడీకి అందుబాటులో ఉండే తేదీల్లో ఈ సభను నిర్వహించేందుకు బీజేపీ యోచిస్తుంది.ఒకవేళ ప్రధాని మోదీ హైదరాబాద్ సభకు హాజరుకాని పరిస్థితుల్లో బదులుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నాడ్డా సభలో పాల్గొంటారని సమాచారం.ఇక ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఓబీసీ మూర్ఛ జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తో బిసి నేతల సమావేశం జరిగింది.అయితే వచ్చే నెల 3న నామినేషన్లు దాఖలు ప్రారంభమై… నవంబర్ 28న ప్రచారాలు గడువు ముగిసే వరకు ప్రధాని మోడీ మొత్తం 6 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు.ఇప్పటికే ఉమ్మడి వరంగల్,నిజామాబాద్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలోని జరిగిన బహిరంగ సభలలో అయన పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే మిగతా జిల్లాలను కూడా మోడీ వచ్చే నెలలో కవర్ చేసి చివరిగా హైదరాబాద్ లో ” బిసి గర్జన ” పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని అయన ప్రచారాన్ని ముగించుకుంటారు. మరోవైపు ఇదే సమయంలో పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా,కేంద్ర మంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా రోజుకో రోడ్ షో , రెండు సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీజీపీ అధిష్ఠానం.