మాగంటి రిటైర్మెంట్…?
ఏలూరు, మార్చి 7, (వాయిస్ టుడే )
Maganti's retirement...?
ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నట్లే కనిపిస్తుంది. ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునట్ల్లేనని చెప్పకతప్పదు. చంద్రబాబు పార్లమెంటు సీటును గత ఎన్నికల్లో మాగంటి బాబుకు ఇవ్వకుండా పక్కన పెట్టారు. బీసీలకు ఇవ్వాల్సి రావడంతో పాటు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ వరసగా ఒకే సామాజికవర్గం నేతలకు టిక్కెట్లు ఇవ్వడంతో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ విషయంలో చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేకతను పాటించారు. యనమల రామకృష్ణుడి అల్లుడికి ఆ సీటును కేటాయించడంతో మాగంటి బాబుకు టిక్కెట్ దూరం అయిందనే చెప్పాలి. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చే సరికి మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు ఈసారి చంద్రబాబు పక్కన పెట్టటానికి అనేక కారణాలున్నాయి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. అయితే మాగంటి కుటుంబానికి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తండి దగ్గర నుంచి ఆయన వరకూ రాజకీయాల్లో కొనసాగారు. 1998 ఎన్నికల్లో ఏలూరు ఏంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి బాబు 2009లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో అదే స్థానం నుంచి గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు. అయితే మాగంటి కుటుంబంలో వరస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంత పార్టీ కార్యక్రమాలకు దూరమైనా ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు.. అయితే ఎక్కువ మంది శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మాగంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు సామాజిక వర్గాల సమీకరణ మాగంటికి టిక్కెట్ రాకుండా పోయింది. అయితే టిక్కెట్ రాకపోయినా తనకు ఏదో ఒక పదవి లభిస్తుందని మాగంటి బాబు భావించారు. రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పలు మార్లు చంద్రబాబుకు మాగంటి మొర పెట్టుకున్నారు. కానీ ఏడాది గడుస్తున్నా మాగంటి బాబు గురించి టీడీపీ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది. మొన్నామధ్య మాగంటి బాబు జనసేన నేత పవన్ కల్యాణ్ ను కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నా ఇప్పటి వరకూ సానుకూలత ఫలితం రాలేదు.అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మాగంటి బాబుకు ఆయన సామాజికవర్గమేఆయనకు శాపంగా మారిందని చెప్పాలి. టిక్కెట్ రాకోవడం దగ్గర నుంచి పదవులు అందకపోవడం వరకూ ఆయనకు క్యాస్ట్ అడ్డుపడుతుందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం పది కాలాల పాటు కొనసాగాలంటే ఎక్కువ మంది బలహీన వర్గాలకు పదవులు ఇవ్వాలన్న పార్టీ అధినాయకత్వం ఆలోచనతో పాటు సీనియర్ నేతలకు కాదని, యువతరానికి అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా అధినాయకత్వం అడుగులు వేస్తుండటంతో మాగంటి బాబుకు ఇక పొలిటికల్ కెరీర్ లేనట్లేనని అనిపిస్తుంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిన అనేక మందిలాగానే మాగంటి కూడా నిలిచిపోయే అవకాశముంది.
==============