మహబూబాబాద్ మెగా ఫ్రైట్ డిపో వెంటనే ప్రారంభించాలి – రైల్వే మంత్రికి బీఆర్‌ఎస్ నేతల వినతి
Mahabubabad Mega Freight Depot Must Be Inaugurated Immediately – BRS Leaders’ Appeal to Railway Minister
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌లో మంజూరైన మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో పనులను తక్షణమే ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నేతలు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలిసి వినతిపత్రం సమర్పించారు.
బుధవారం సాయంత్రం పార్లమెంట్‌లోని మంత్రి ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో, వరంగల్–మహబూబాబాద్ సెక్షన్‌కు సంబంధించిన ఈ కీలక ప్రాజెక్ట్‌పై వారు మంత్రి దృష్టిని ఆకర్షించారు. సుమారు రూ.908.15 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో భారతీయ రైల్వేకు వ్యూహాత్మకంగా ఎంతో అవసరమని వివరించారు.
ఈ డిపోలో ఫ్రైట్ రోలింగ్ స్టాక్‌కు సంబంధించిన పీరియాడిక్ ఓవర్‌హాలింగ్, రెగ్యులర్ ఓవర్‌హాలింగ్, సిక్ లైన్ తనిఖీ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా అనంతారం ప్రాంతంలో 409.01 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
అయితే, డిసెంబర్ 2025 నాటికి భూమి కేటాయింపు పూర్తయినప్పటికీ, ప్రాజెక్ట్ అమలు మాత్రం ప్రణాళిక దశలోనే నిలిచిపోయిందని ఎంపీ వద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్ట్ అమలు ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఉండి, దేశంలోని సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహబూబాబాద్ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా ప్రాంతీయ అభివృద్ధి ఆగిపోతుందని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేసి, పనులను తక్షణమే ప్రారంభించాల్సిందిగా ఎంపీ రవిచంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ ప్రజలు ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధికి చిహ్నంగా ఎదురుచూస్తున్నారని, మీ మార్గదర్శకత్వంలో త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.



