విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి ప్రతినిధి:
Mahatma Jyotiba Phule was a great man who emphasized the importance of education
చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య మ ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గతంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని అన్నారు. 1827 లో మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా చాలా కష్టమని, అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కలెక్టర్ అన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆకాంక్షిం చారని తెలిపారు. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సి స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఒక రాత్రిలో అనూహ్యమైన మార్పులు రానప్పటికి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిదానంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, మెరుగైన విద్యాబోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటు న్నామని కలెక్టర్ తెలిపారు.
మహనీయుల జయంతి ఉత్సవాలలో వచ్చిన వక్తలు అడిగిన వివిధ అంశాలను అధికారులు సంపూర్ణంగా వివరించాలని, మహనీయుల ఆశయాల సాధన కోసం, సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమా లను చివరి అర్హుల వరకు అందే విధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జే.రంగా రెడ్డి, కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు ప్రకాశ్, జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు బొంకూరి శంకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్. శంకర్, వివిధ ప్రజా ప్రతినిధు లు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.