మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ
Minister Lokesh participated in the wedding ceremony of Mangalagiri Sri Lakshmi Narasimha Swamy.
మంగళగిరిః
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గం.లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విష్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాదపక్షాలన, విశేష అర్చన, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.