కాక రేపుతున్న మంత్రి పదవులు
హైదరాబాద్, ఏప్రిల్ 16, (వాయిస్ టుడే)
Ministerial positions that are not yet open
కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. మంత్రి పదవులపై లుకలుకలు మొదలయ్యాయి. మాకంటే మాకంటూ కేబినెట్ బెర్త్ కోసం కర్చీఫ్ వేస్తున్నారు ప్రముఖులంతా. ఉగాదికే జాబితా వస్తుందనుకుంటే.. అది కాస్తా ఆలస్యం అవుతుండటంతో రచ్చ రాజుకుంటోంది. ఆ ఉక్కబోత భరించలేక ఆశావహులు ఒక్కొక్కరిగా నోరు జారుతున్నారు. బహిరంగంగానే బయటపడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మాజీ మంత్రి జానారెడ్డిని టార్గెట్ చేయగా.. లేటెస్ట్‌గా ప్రేమ్ సాగర్ రావు.. ఓ కుటుంబాన్ని కార్నర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో కలకలం రేపారు.మంత్రి పదవిని అడ్డుకుంటూ.. తన గొంతు కోసేందుకు ఓ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గొంతు కోస్తే ఊరుకోబోనని.. కుటిల యత్నాలను తిప్పికొడతానని హెచ్చరించారు. పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని.. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దన్నారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ప్రేమ్ సాగర్ రావు టార్గెట్ చేసింది ఎవరిననే చర్చ జరుగుతోంది తెలంగాణలో.రాజగోపాల్‌రెడ్డి గురించే ప్రేమ్‌సాగర్ అలా అన్నారని కొందరు అంటున్నా.. అది కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఆయన మాట్లాడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల గురించేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినే తన మంత్రి పదవికి చెక్ పెడుతున్నారనేది ప్రేమ్ సాగర్ వ్యాఖ్యల అంతరార్ధం అంటున్నారు. వివేక్‌తో పాటు కుటుంబంలో ఆయన సోదరుడు వినోద్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కొడుకు వంశీ.. ఎంపీగా కొనసాగుతున్నారు. వివేక్ గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత బీజేపీకి మారారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్ చేస్తూ.. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారంటూ కామెంట్స్ చేశారు. ఉమ్మడి జిల్లా కోటాలో కేబినెట్ రేసులో ప్రేమ్ సాగర్‌కు వివేక్ నుంచి పోటీ ఉంది. ఆ ఫ్యామిలీ గుత్తాధిపత్యం కోసమే.. తన కేబినెట్ బెర్త్ కన్ఫామ్ కాకుండా అడ్డుకుంటున్నారనేది ప్రేమ్ సాగర్ రావు అక్కసుగా తెలుస్తోంది.పెద్దలు జానారెడ్డిని రాజగోపాల్‌రెడ్డి టార్గెట్ చేసిన మరుసటి రోజే ప్రేమ్ సాగర్ రావు సైతం బహిరంగ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీలో కాస్త కుదుపు వచ్చినట్టైంది. కేబినెట్ విస్తరణ లేట్ అవుతున్నా కొద్దీ.. ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని.. అందుకే వీలైనంత తొందరగా ఆ పని పూర్తి చేయాలని అధిష్టానానికి మెసేజ్‌లు వెళ్తున్నాయట. నల్గొండలో రాజగోపాల్‌రెడ్డి బలమైన నాయకుడు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు తిరుగులేని నేత. వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై పార్టీ పెద్దలెవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈయన్ను అడ్డుకోవడం అనేది టీ కప్పులో తుఫాను లాంటి వివాదమే తప్ప అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆదిలాబాద్‌లో మాత్రం ప్రాబ్లమ్ కాస్త సీరియస్ గానే ఉన్నట్టుంది. ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన్ను సంతృప్తి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చెన్నూర్‌ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ పార్టీని వీడిపోయినా ఆయన మాత్రం పార్టీ కోసం ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేంసాగర్‌రావు కృషి వల్లనే అని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 66వేలకుపైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ప్రధానంగా గడ్డం వివేక్ నుంచి పోటీ వస్తోంది. ఆయన ఎస్సీ నేత కావడంతో ప్లస్ గా మారింది. అయితే పలుమార్లు పార్టీ మారి వచ్చారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలచిన వెడ్మ బొజ్జు కూడా గిరిజన కోటాలో తనకు పదవి వరిస్తుందనే ఆశతో ఉన్నారు.సామాజిక సమీకరణాలతో తన సీనియార్టీని.. పార్టీకి చేసిన సేవలను గుర్తించకపోతే ఊరుకునేది లేదని ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే చెబుతున్నారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తనకు పదవి రాకుండా.. చేసేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయిపోయిందని అనుకులోనేలోపే కొత్త కొత్త అడ్డంకులు వచ్చేశాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవడంతో మూడో తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ మానసికంగా రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెర్తులన్నదానిపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఆ మూడో తేదీ దాటి పది రోజులు అయినా హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈ లోపు పార్టీ నేతుల ఎవరికి వారు తమకు పదవులు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లపై తెరపైకి వస్తున్నారు. ఒకరికి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అసంతృప్తి పెరిగి పుట్టి మునిగిపోతుందని అసలు మంత్రి వర్గ విస్తరణనే కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.