ముఖం చాటేస్తున్న మంత్రులు
హైదరాబాద్, ఏప్రిల్ 16, (వాయిస్ టుడే)
Ministers making faces
కాంగ్రెస్ మంత్రులు గాంధీభవన్ ముఖం చూడటమే మానేశారు. ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని ప్రకటించిన షెడ్యూల్ మూడు రోజుల మురిపెంగా మిగిలింది. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గం చూపాల్సిన మంత్రులు గాంధీభవన్‌కు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక ఇటు కార్యకర్తలు అటు ప్రజలు గాంధీభవన్ చుట్టూ తిరుగుతూ ఇబ్బది పడాల్సి వస్తోందంట.. అసలు మంత్రుల షెడ్యూల్‌లో మార్పులు ఎందుకు వచ్చాయి? మళ్ళీ గాంధీభవన్‌కి మంత్రుల వస్తారా? పార్టీ వర్గాల్లో దానిపై జరుగుతున్న చర్చేంటి?ప్రజా పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో వారానికి ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ పెద్దలు షెడ్యూల్ రూపొందించారు. సచివాలయంలో మంత్రులు తమ డిపార్టమెంట్ పనులతో బిజీబిజీగా ఉంటారు. కాబట్టి ప్రజలు సచివాలయానికి వెళ్ళినా మంత్రులను కలిసే అవకాశం పెద్దగా ఉండదు . సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండదు.అందుకే మంత్రులను కలిసే వెసులుబాటు ఉండాలి, ప్రజల సాధక బాధకాలు చెప్పుకునే సౌలభ్యం ఉండాలనే ఉద్దేశంతో గాంధీభవన్లో వారానికి ఇద్దరు మంత్రులు అందరికీ అందుబాటులో ఉంటారని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. వారంలో ఇద్దరు మంత్రులు పక్కాగా గాంధీభవన్‌కు వస్తారు,ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, ప్రజలిచ్చే ఆర్జీలను తీసుకుంటారు, సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో గాంధీభవన్‌లో ఆయన మంత్రుల ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేశారు.వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉంటారని పీసీసీ ఛీఫ్ షెడ్యూల కూడా ఖరారు చేశారు. దానికి తగ్గట్లే ఆరంభంలో కొన్ని వారాలు వారానికి ఇద్దరు చొప్పున మంత్రులు వచ్చారు ప్రజల సమస్యలను విన్నారు. అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మొదట్లో వారానికి ఇద్దరు మంత్రులు వచ్చేవారు. అది కాస్త తర్వాత వారానికి ఒకే మంత్రి అయ్యారు. మంత్రులు వచ్చినప్పుడు గాంధీభవన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని తమ ఇబ్బందులు చెప్పుకునేవారు. మంత్రులు వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవడంతో గాంధీభవన్ కి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.తీరా చూస్తే కొన్ని వారాల నుండి మంత్రులు గాంధీభవన్‌కు రావడం లేదు. పీసీసీ అధ్యక్షుడు కూడా మంత్రులను గాంధీభవన్ కి తీసుకువచ్చే అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదనే చర్చ జరుగుతుంది. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో కార్యక్రమం మొదలుపెడితే.. కొద్ది కాలంగా మంత్రులు గాంధీభవన్‌కు రాకపోతుండటంతో ప్రజలు కూడా అటు వైపు రావడం మానేస్తున్నారు. ఇక సమస్యలు చెప్పుకుందామని సచివాలయానికి వెళ్తూ తమ శాఖల పనుల మీద మంత్రులు బిజీగా ఉంటున్నారంట. లేకపోతే సంబంధిత మంత్రులు ప్రజలు వెళ్లిన సమయంలో అందుబాటులో ఉండడం లేదంట. కొన్ని సందర్భాల్లో మంత్రులు ఉన్నా మంత్రుల సిబ్బంది తమను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని జనం విమర్శిస్తున్నారు.ఓ వైపు గాంధీభవన్ కు మంత్రులు రాకపోవడం.. మరోవైపు సచివాలయంకి వెళ్తే మంత్రులు దొరకకపోవడంతో.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. గాంధీభవన్‌కు మంత్రులు వచ్చేలా మరోసారి పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చొరవ తీసుకొని, రెగ్యులర్‌గా వారానికి రెండు రోజులు మంత్రులు అందుబాటులో ఉండేలా చూస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా నెలారెండు నెలలకు ఒకసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్ కు వచ్చేలా మహేష్ కుమార్ గౌడ్ చొరవ చూపితే ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మొత్తానికి గాంధీభవన్‌కు మంత్రుల షెడ్యూల్ తప్పడంతో…కాంగ్రెస్ ఏ పని తలపెట్టినా ఆరంభ శూరత్వమే అవుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. మరి గాంధీభవన్ కు మళ్లీ మంత్రులను రప్పించి ఆ విమర్శలను పీసీసీ చీఫ్ తిప్పికొడతారా? కొన్ని వారాలుగా గాంధీభవన్‌లో దర్శనమివ్వని మంత్రులు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారా? అన్నది చూడాలి.