Sunday, September 8, 2024

ఎమ్మెల్యేల ఓటమి కోసం ఎమ్మెల్సీల ప్లాన్ ?

- Advertisement -

వరంగల్, నవంబర్ 2, (వాయిస్ టుడే): అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తమదైన శైలిలో వ్యవహారం నడిపిస్తున్నారు. టికెట్ రాలేదన్న అక్కసుతో అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీ కోసమే పనిచేస్తున్నట్టు నటిస్తన్నా ఫీల్డులో మాత్రం అభ్యర్థిని ఓడించేందుకే వ్యూహాలు రచిస్తున్నారని నాయకత్వం గ్రహించింది. ఎన్నికల ప్రచారంలో ఏ ఎమ్మెల్సీ తీరు ఎలా ఉన్నదో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రగతి భవన్‌కు రిపోర్టు అందిస్తున్నాయి. టికెట్ దక్కలేదని కోపంతో పలువురు ఎమ్మెల్సీలు పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఇన్‌పుట్స్ గులాబీ బాస్‌కు చేరాయి.టికెట్ కోసం పలువురు ఎమ్మెల్సీలు చివరి నిమిషం వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చారు. దీంతో వారు నిరాశకు లోనయ్యారు. పార్టీ తరఫున కొన్ని బాధ్యతలు భుజాన వేసుకోక తప్పలేదు. అభ్యర్థులకు సహకరిస్తామని చెప్తున్నా రెండు నెలల కార్యాచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నాయకత్వం గ్రహించింది. పార్టీ సమావేశంలోనే కొద్దిమంది ఎమ్మెల్సీలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్సీల పనితీరులో మార్పు రాలేదనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది.అభ్యర్థిని గెలిపించే బాధ్యతను వారి భుజాన వేసినా పార్టీ ఆదేశం మేరకు సహకారం ఇవ్వడంలేదనేది తేలిపోయింది. దీనికి తోడు ఎమ్మెల్సీలు వారి అనుచరులకు నోటిమాటగా ఆదేశాలిచ్చి అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. సహకారం అందించడానికి బదులుగా ఓడించడానికి లోపాయకారీగా పనిచేస్తున్నట్లు తేలడం అధినేత ఆగ్రహానికి కారణమైంది. కుల సంఘాల లీడర్లకు ఫోన్ చేసి, వ్యతిరేకంగా పనిచేయాలని సూచించిన విషయం బాస్‌కు తెలిసిందని సమాచారం. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇదే తరహాలోనే వచ్చినట్టు తెలిసింది.తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పరిహారంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ తాండూరులో అభ్యర్థిగా ఉన్న పైలట్ రోహిత్‌రెడ్డి విజయం కోసం పనిచేయడంపై దృష్టి పెట్టకుండా, కొడంగల్‌లో పోటీ చేస్తోన్న తన సోదరుడు నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకే ఆరాటపడుతున్నట్టు ప్రచారం ఉంది. తాండూరులో ఉన్న పట్నం అనుచరులు కూడా రోహిత్‌రెడ్డి వర్గానికి సహకరించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.భూపాలపల్లి టికెట్ రాకపోవడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్థానికంగా ప్రచారం చేయకుండా, ఎక్కువ సమయం హైదరాబాల్‌లోనే గడుపుతున్నారు. అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని తన అనుచరులకు ఫోన్ చేసి చెప్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వైఎస్సాఆర్టీపీ చెందిన ఓ స్థానిక లీడర్ ఇటీవల బీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయినా బెడిసికొట్టేలా చక్రం తిప్పారన్న కంప్లైట్స్ వచ్చాయి. ఆయన కొడుకు సైతం అభ్యర్థి విజయం కోసం పనిచేయం లేదని నిఘా వర్గాలు అధినేతకు తెలిపాయి.నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వనందుకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం అక్కడి సిట్టింగ్ అభ్యర్థి నోముల భగత్‌కు సహకరించడం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కోటిరెడ్డి కదలికలపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టి క్షేత్రస్థాయి నుంచి వివరాలను తెప్పించుకున్నది. ఆయన నెల రోజుల యాక్టివిటీస్‌ను రిపోర్టు రూపంలో సేకరించింది. అయితే భగత్ వర్గీయులే కోటిరెడ్డి వర్గంతో దూరంగా ఉంటున్నట్టు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీకి గ్రౌండ్ బలపడుతున్నదనే పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా అభ్యర్థికి, ఎమ్మెల్సీకి మధ్య గ్యాప్ రావడం పార్టీని ఆందోళనలో పడేసింది.స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చాలారోజుల పాటు అసంతృప్తితో ఉన్నారు. అలిగిన ఆయనను కూల్ చేయడానికి రాష్ట్ర నేతలు వారి వంతు ప్రయత్నాలు చేశారు. చివరకు అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సహకరించేలా ఒప్పించారు. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పర్చే ప్రయత్నమూ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇందిర పేరును ఖరారు చేయడంతో సీన్ మారిపోయింది. రాజయ్యకు ఇందిర సమీప బంధువు (సోదరి వరుస) కావడంతో ఆమె గెలుపు కోసమే పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్ర నాయకత్వానికి చేరాయి. కడియం శ్రీహరి సైతం రాజయ్యపైనా, ఆయన అనుచరులపైనా ఆధారపడకుండా, వారి సహకారాన్ని కోరకుండా సొంత టీమ్‌కే ప్రయారిటీ ఇస్తున్నట్టు తేలింది.అసెంబ్లీ టికెట్ ఆశించినా ఊహించని నిరాశ ఎదురుకావడంతో అభ్యర్థికి ఉన్న గ్రౌండ్‌ను డిస్టర్బ్ చేసి సెగ్మెంట్‌లో వారి పెత్తనాన్ని కొనసాగేలా ఎమ్మెల్సీలు పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థులు గెలవకూడదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఒకవేళ అభ్యర్థులు గెలిస్తే అటు సెగ్మెంట్‌లో బలపడతారని, వారిదే పెత్తనమవుతుందని, పార్టీలోనూ హీరోలుగా చెలామణి అవుతారని, చివరకు తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళనే ఇందుకు కారణమని పార్టీ ఒక స్పష్టతకు వచ్చింది. ఈ భయంతోనే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలు పావులు కదుపుతున్నట్టు నాయకత్వం భావిస్తున్నది. పార్టీ ప్రచారానికి దూరంగా ఉండడం, అంటీముట్టన్నట్టుగా వ్యవహరించడం ఇందులో భాగమేనని గ్రహించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్