హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో భాజపా నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరువాత రాష్ట్రానికి ప్రధాని రానుండటం ఇదే తొలిసారి.
15 నుంచి ప్రచారం ఉద్ధృతం
అలాగే నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని భాజపా ఉద్ధృతం చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీ తరువాత మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లు
ఎన్నికల ప్రచారం కోసం భాజపా జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లను సమకూర్చింది. ఒకటి పూర్తిగా బండి సంజయ్‌కు కేటాయించగా.. మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.