తల్లి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా
కడప, జనవరి 30,
రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షర్మిల రూపంలో పెద్ద సవాలే ఎదురవుతోంది. ఒకపక్క ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానాలు చెప్పడంతోపాటు మరోపక్క జగన్ చెల్లెలు షర్మిల సంధించే బాణాలకు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయపరమైన విమర్శలకు పార్టీ నాయకులు సమాధానం చెప్పేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కానీ, షర్మిల చేస్తున్న కుటుంబపరమైన విమర్శలు, ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యులుపైనే ఉంటుంది. షర్మిల చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందిస్తే షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ షర్మిలను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రాజకీయ విమర్శలను ఎక్కుబెట్టిన షర్మిల.. తాజాగా కుటుంబ పరమైన విమర్శలు, ఆరోపణలను తీవ్రతరం చేసింది. ఇవన్నీ వైసీపీని ఇరకాటంలో పెట్టేలా ఉంటున్నాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం షర్మిలకు చెక్‌పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో అన్నా, చెల్లెలు మధ్య సాగుతున్న రాజకీయ రణక్షేత్రాన్ని ఏ తల్లి కూడా స్వాగతించదు. కానీ, వైఎస్ విజయమ్మకు ఈ పరిస్థితి ఏర్పడింది. షర్మల కుటుంబ విషయాలను రోడ్డు మీదకు వచ్చి ఆరోపణలు చేస్తుండడంతో జగన్ తన తల్లి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. తాను షర్మిలపై విమర్శలు చేయడం కంటే.. నువ్వే బయటకు వచ్చిన వాస్తవాలను చెప్పాలని కోరినట్టు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీకి అండగా వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా సీఎం జగన్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు విజయమ్మను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయమ్మ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. మంచి ముహూర్తం చూసి పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రచారంలోనే వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై చేస్తున్న అనేక విమర్శలు, ఆరోపణలకు విజయమ్మ సమాధానం చెబుతారని భావిస్తున్నారు. విజయమ్మ బరిలోకి దించడం ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్‌పై చేస్తున్న అనేక విమర్శలకు సమాధానం చెప్పినట్టు అవుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. తల్లి, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం చూస్తాడంటే చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శలకు, తనకు అన్యాయం చేశాడంటూ షర్మిల మాట్లాడుతున్న మాటలకు విజయమ్మను రాజకీయ రణక్షేత్రంలో దించడం ద్వారా సమాధానం చెప్పినట్టు అవుతుందని వైసీపీ భావిస్తోంది. విజయమ్మతో సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు అనేక ప్రాంతాల్లో సమావేశాలు పెట్టించేందుకు వైసీపీ సమాయత్తమవుతోంది. కూతురు, కొడుకు మధ్య జరుగుతున్న పోరును చూసి తీవ్ర ఆవేదన చెందుతున్న విజయమ్మను.. ఈ మేరకు ఒప్పించడంలో వైవీ సుబ్బారెడ్డ, ఆయన సతీమణితోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. షర్మిల రాకతో వైసీపీకి తగిలిన రాజకీయ డ్యామేజీని విజయమ్మ ద్వారా కొంతలో కొంతైనా పూడ్చుకునే ప్రయత్నాలను వైసీపీ చేస్తోంది. ఇవి ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.
తల్లి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా
- Advertisement -
- Advertisement -