రామ్మోహన్ గౌడ్ దంపతులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
వనస్థలిపురం, ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తన సతీమణి మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్నతో కలిసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దగౌని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్టు దక్కకపోవడంతో గతకొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం ఉదయం రామ్మోహన్ గౌడ్ నివాసానికి చేరుకొని ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ దంపతులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ దంపతులు కాంగ్రెస్‌ను విడిచి, బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న సమాచారం తెలుసుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలను నాయకులు సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది. ఎమ్మెల్యే టికెట్టు ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, తనకు టికెట్టు ఇవ్వకుండా మోసం చేశారని ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత తగాదాల వల్లే, ఇటీవల తాము ఇటీవల పార్టీ మారినట్టు ఆయన అంగీకరించారు. ఇకమీదట పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని అన్నారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.



