ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలి – ఈటల రాజేందర్

- Advertisement -

ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలి – ఈటల రాజేందర్
ఐక్య పోరాటం కోసం సిద్ధం కండి

Mudirajs Must Be Included in BC-A – Eatala Rajender

జలవిహార్‌లో “ముదిరాజ్ సింహవాలోకనం” సభలో డిమాండ్

హైదరాబాద్, మే 26: ముదిరాజ్‌లను బీసీ-డీ వర్గం నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కోరారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జలవిహార్‌లో నిర్వహించిన **“ముదిరాజ్ సింహవాలోకనం”** కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బాండ ప్రకాష్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు , కంచ ఐలయ్య , దినేష్ , డాక్టర్ శివ కేశవ్ , ఉప్పరి నారాయణ, జగన్ ముదిరాజ్, ముదిరాజ్ విద్యార్థుల వేదిక కన్వీనర్ జూలు నాగేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పలు ముదిరాజ్ సంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ముదిరాజ్ సమాజం ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందన్నారు. బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న అంశాన్ని తానే తొలిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించానని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి వై . స్ . రాజశేఖర రెడ్డి హయాంలో ఈ అంశంపై పలుమార్లు చర్చ జరిగిందని, 2008లో ఉత్తర్వులు కూడా జారీ అయినప్పటికీ అమలు దశలో నిలిచిపోయిందన్నారు.

ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ప్రభుత్వ సర్వేలే నిర్ధారించాయని పేర్కొన్న ఆయన, ప్రజాస్వామ్యంలో జనాభా ఆధారంగా అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లభించాలని అన్నారు. తెలంగాణలో ముదిరాజ్‌లు సుమారు 26 లక్షల జనాభాతో 7.46 శాతం ఉన్నారని, రాష్ట్రంలో అతిపెద్ద కులంగా ఉన్నప్పటికీ తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

“మేము ఏ కులాన్ని, వర్గాన్ని ద్వేషించే వారు కాదు. మా హక్కులు, న్యాయమైన వాటా మాత్రమే కోరుతున్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప. మనలాంటి వెనుకబడిన జాతులందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగాలి” అని ఈటల పిలుపునిచ్చారు.

రాజకీయ పార్టీలు వేర్వేరు కావొచ్చని, కానీ జాతి ప్రయోజనాలు, సామాజిక న్యాయం విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ముదిరాజ్ సమాజం ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం తప్పక స్పందిస్తుందని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular