సౌత్ కు పెద్ద దిక్కుగా పవన్
న్యూఢిల్లీ, మే 27, (వాయిస్ టుడే )
Pawan is a big star for the South
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. జాతీయస్థాయిలో సైతం పవన్ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు. ఇదంతా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష గెలుపుతోనే సాధ్యమైంది. తాను గెలవడమే కాకుండా టిడిపి కూటమిని అధికారంలోకి తెచ్చారు పవన్. బిజెపిని టిడిపి తో జత కలిపారు. ఆ మూడు పార్టీల ఎంపీల బలంతో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. సహజంగానే ఇది పవన్ కు మైలేజ్ ఇచ్చే అంశం కావడంతో.. ఆయన ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎనలేని గౌరవం ఇస్తున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఏకాభిప్రాయ సాధనకు కూడా పవన్ కళ్యాణ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగించడం విశేషం. క్రమేపి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి రైట్ హ్యాండ్ గా మారిపోయారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.2024 ఎన్నికలకు ముందు జనసేన ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. అంతకుముందు ఎన్నికల్లో ఒకే చోట గెలిచింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ను నాయకుడిగా కూడా చూసేవారు కాదు ప్రత్యర్ధులు. ఆపై జాతీయస్థాయిలో బిజెపి పెద్దలు లైట్ తీసుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ మానియా పనిచేసింది. పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారు. ఏపీలో టీడీపీ కూటమి, జాతీయస్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ వంటి విషయంలో పవన్ దూకుడు వెనుక బిజెపి పెద్దలు ఉన్నారు అన్నది ఒక అనుమానం. పైగా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తుండడంతో పవన్ కళ్యాణ్ ను ఒక తురుపు ముక్కగా వాడుకోవడం ప్రారంభించారు బిజెపి పెద్దలు. 2024 ఎన్నికల తరువాత.. చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బిజెపి తరఫున ప్రచారం చేశారు. ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు పాటుపడ్డారు. దీంతో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు.ముఖ్యంగా ప్రధాని మోదీపవన్ కళ్యాణ్ విషయంలో చూపే అభిమానం చాలా సందర్భాల్లో బయటపడింది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందే బిజెపితో దోస్తీ కట్టారు పవన్ కళ్యాణ్. కానీ ఎన్నడూ ప్రధాని మోదీని కలిసి ప్రయత్నం చేయలేదు. అయితే ఆ ఇద్దరి నేతల మధ్య బంధం ప్రమాణ స్వీకార సమయంలో బయటపడింది. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మరోసారి నీతి ఆయోగ్ సమావేశంలో.. పవన్ కాదు గన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మొన్నటికి మొన్న అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ఆ సమయంలో పవన్ ప్రసంగానికి ఫిదా అయ్యారు. ప్రసంగం తర్వాత ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. సరదాగా చాక్లెట్ ను అందించి నవ్వులు పంచారు.ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం ఉండడంతో.. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కు ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తనతో కలిసి భోజనానికి ఆహ్వానించారు. పవన్ తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్లను ప్రధాని ఆహ్వానించడంతో వారు.. హాజరయ్యారు. మరోవైపు పవన్ తన ఎక్స్ ఖాతాలో నిజమైన హీరోతో కలిసి భోజనం చేశారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానిని నిజమైన హీరో గా పోల్చడంతో.. పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో కూడా ఆకర్షించగలుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాని మోడీకి కుడి భుజంగా మారిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.