రాహుల్ హత్యలో తెరపైకి కొత్త పేర్లు
విజయవాడ మార్చి 3, (వాయిస్ టుడే )
New names on the screen in Rahul's murder
ఏపీలో సంచలనం సృష్టించిన, 2021లో జరిగిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో సూత్రధారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి అని పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కోరాడ విజయ్‌కుమార్ ఆరోపించారు. హత్య చేయించింది తలశిల రఘురామ్, వెలంపల్లి శ్రీనివాస్ అని సంచలన ఆరోపణలు చేశారు.. ఆ కేసులో తాము నిర్దోషులమని, తమను కావాలనే ఇరికించారని అన్నారు. ఆ ఇద్దరు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డితో కలసి ఫ్యాక్టరీ నిర్మాణానికి రాహుల్ రూ.40 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఈ హత్య జరగడానికి ముందు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి దగ్గర ఆ రూ.40 కోట్లు తీసుకున్నారని చెప్పారు. ఈ ఒప్పందంలో గొడవల కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు. హత్య డైరెక్షన్ మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదేనని.. పాల్గొన్నది, చేయించింది తలశిల రఘురామ్, వెల్లంపల్లి శ్రీనివాస్ అని ఆరోపించారు. ఈ సమాచారం సేకరించేందుకు తమకు చాలా సమయం పట్టిందన్నారు. ఈ హత్య చేసింది తాము కాదని నాటి సీఎం జగన్‌కు, హోంమంత్రికి వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. హత్యలో పాల్గొన్నవారిని మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఇన్వెస్టిగేషన్ మార్చాలని సత్యనారాయణ, విజయ్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ తండ్రి సైతం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో రిట్ వేశారని, కేసును సీఐడీకి గానీ, సీబీఐకి గానీ ఇచ్చి పునర్విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ వీడియోను ఆనాటి మంత్రులకు పంపారని ఆరోపించారు. తాము జైలు నుంచి వచ్చేసరికి ఈ కేసులోని వాస్తవాలను వైసీపీ నేతలు మాయం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలకు, ఆనాటి విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బయటకు తీస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయన్నారు. కేసు కోర్టు లో ఉంది కాబట్టి తాము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని, ఈ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో పాటు ఈడీ, ఇన్కమ్ టాక్స్ కూడా ఇన్వెస్టిగేషన్ జరపాలని.. అప్పుడే రాహుల్ అతని తండ్రి ఆర్థిక పరిస్థితి తెలుస్తుందన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు.ఒంగోలు జడ్పీ కాలనీకి చెందిన కరణం రాహుల్ కెనడాలో ఎంఎస్ పూర్తిచేసి, కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తిరిగొచ్చి విజయవాడకు మకాం మర్చారు. గతంలో తమ కుటుంబానికి పరిచయం ఉన్న కోరాడ విజయకుమార్‌తో పాటు, బొబ్బా రాహుల్ చౌదరి, బొబ్బా వెంకటేశ్వరరావులతో కలిసి కృష్ణా జిల్లా జి.కొండూరులో జిక్సిన్ సిలిండర్స్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. ఇందులో రాహుల్, కోరాడ, స్వామికిరణ్, బొబ్బా రాహుల్ చౌదరి, అతడి తండ్రి వెంకటేశ్వరరావు కలిపి రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టారు. దీనికి రాహుల్ ఎండీగా ఉన్నారు. ఆ తర్వాత వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో భాగస్వాముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2021 ఆగస్టు 18న రాహుల్ కారులో ఉన్న ఛార్జర్ వైరుతో గొంతు నులిమి హతమార్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన ఈ హత్యలో 14 మంది పాల్గొన్నారని విజయవాడ పోలీసులు తేల్చారు. ఈ కేసులో కోగంటి సత్యనారాయణ, విజయకుమార్ తోపాటు అనంత్ సత్యనారాయణ, జానీ, కోటి, బాబు, రవికాంత్ తదితరులను అరెస్ట్ చేశారు.