రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసనకు అపోలోలో కొత్త బాధ్యతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24
New responsibilities for Ram Charan’s wife Upasana at Apollo.
ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో కీలక నియామకం జరిగింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్‌గా, మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, నటుడు రామ్ చరణ్ అర్ధాంగిగా సుపరిచితురాలైన ఉపాసన కొణిదెల, తాజాగా అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమాలకు ఆమె ఇకపై నాయకత్వం వహించనున్నారు.ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సుమారు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో తమ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా భారతదేశవ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణ వంటి ప్రాజెక్టులను ఉపాసన పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా రోగులకు అత్యుత్తమ సౌకర్యాలు అందించేలా హాస్పిటల్ డిజైన్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. యాజమాన్యంతో, ప్రాజెక్ట్ భాగస్వాములతో కలిసి పనిచేస్తూ, విస్తరణ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ఆమె ప్రధాన బాధ్యతగా ఉంటుంది.ఈ నియామకంపై ఉపాసన స్పందిస్తూ.. తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని తెలిపారు. “ప్రపంచ స్థాయి వైద్యాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆయన కల. మేము నిర్మించే ప్రతి ఆసుపత్రిలో, అభివృద్ధి చేసే ప్రతి సౌకర్యంలో ఆ నమ్మకాన్ని ప్రతిబింబించేలా చూడటమే నా బాధ్యత” అని ఆమె పేర్కొన్నారు. మంచి హాస్పిటల్ డిజైన్ అనేది రోగులకు సులువుగా దారి చూపడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, వైద్య బృందాలు సమర్థవంతంగా చికిత్స అందించడానికి వీలు కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టినా, ఉపాసన తన ఇతర కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తారు. డిజిటల్ వెల్నెస్, కార్పొరేట్ హెల్త్‌కేర్ వేదిక అయిన ‘యూఆర్‌లైఫ్’ (URLife) వ్యవస్థాపకురాలిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అపోలో గ్రూప్ సీఎస్ఆర్ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆమె నియామకం అపోలో విస్తరణ ప్రణాళికలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.




