- Advertisement -
నెంబర్ 2 పొంగులేటేనా…
Number 2 Ponguletena...
ఖమ్మం, జనవరి 4, (వాయిస్ టుడే)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో పొంగులేటి శ్రీనివాసులురెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా ఆయన మిగిలిన నేతలను మించిపోయారు. . పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తెలంగాణ కేబినెట్ లో కీలకమైన మంత్రిగా చెబుతారు. ఒకరకంగా చెప్పాలంటే మల్లు భట్టి విక్రమార్క తర్వాత పొంగులేటికే పార్టీ హైకమాండ్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రయారిటీ ఇస్తారంటారు. అందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు వంటి వారికంటే పొంగులేటి ఒక అడుగు ముందే ఉన్నారన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తొలుత వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆర్థికంగానే కాదు సామాజికవర్గంగా కూడా బలమైన నేత. ఆయన 2014లో వైసీపీ నుంచి ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైసీపీకి కొంత కాలం టీవైసీపీ అధ్యక్షుడిగా పనిచేసినా తర్వాత పార్టీకి రాజీనామా చేసి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు అంత ప్రాధాన్యత లభించలేదు. అక్కడ పువ్వాడ అజయ్ కు ఇచ్చిన ప్రాధాన్యత బీఆర్ఎస్ హైకమాండ్ పొంగులేటికి ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చేరారు కేబినెట్ లో ప్రధానమైన శాఖను కూడా పొంగులేటి శ్రీనివాసులురెడ్డికి కేటాయించారు. రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన సమాచారశాఖను కూడాపొంగులేటికి రేవంత్ రెడ్డి కట్టబెట్టారు. అంటే ఆయనపై ఎంత నమ్మకం ఉంచారో ఇలాగే అర్థం అవుతుంది. ఇక ముఖ్యమైన మంత్రి వర్గ ఉప సంఘాల్లో కూడా ఆయనను సభ్యుడిగా నియమించారు. ఏదైనా బహిరంగ సభ నిర్వహణ బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి పొంగులేటికి అప్పగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు కారణాలు ఆర్థికంగా పార్టీకి ఖర్చు చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా పొంగులేటి ఎటువంటి నిబంధనలకు అతిక్రమించకుండా ఉంటారని కీలకమైన బాధ్యతలను ఆయనకు అప్పగించారంటున్నారు. అయితే ఇక్కడ మంత్రులలో తమకు దక్కని ప్రాధాన్యత పొంగులేటికి దక్కుతుండటంపై మిగిలిన మంత్రుల్లో ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తమవుతున్నా బయటపడటం లేదు. ఐదేళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడంతో ఢిల్లీలో ఆయన లాబీయింగ్ చేయగలడన్న నమ్మకం రేవంత్ లో ఉందని చెబుతున్నారు. నిజానికి పొంగులేటి లేట్ గా జాయిన్ అయి… లేటెస్ట్ గా పాతుకు పోయాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నప్పటికీ తుమ్మల నాగేశ్వరరావుతో రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి పరిచయాలున్నప్పటికీ పొంగులేటికే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. అందుకే కాంగ్రెస్ కింది స్థాయి నేతలు కూడా ఏదైనా పదవి కావాలనుకుంటే పొంగులేటి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారట. ఇంకా ఒకటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో పొంగులేటి నెంబరు 2గా చెలామణి అవుతున్నారన్న వారున్నా అందులో వాస్తవం లేదంటున్నారు మరికొందరు.
- Advertisement -