మండిపడ్డ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ నవంబర్ 3: కాళేశ్వరం బ్యారేజ్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా వ్యవహరిస్తుయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తప్పుడు వైఖరి కారణంగా తెలంగాణ రాష్టానికి అపకీర్తి వచ్చేలా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి ప్రాజెక్టు అంటే ఏమిటి వ్యవసాయం అంటే ఏమిటో అస్సలు తెలియదన్నారు. జలయజ్ఞం పేరుతో ధనాన్ని ధన యజ్ఞం చేసిన వాళ్లు ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాట్లాడటం విడ్డురంగా ఉంది.రాజకీయాల్లో వ్యక్తి గత విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు. భావితరాలకు ఆదర్శంగా నేటి రాజకీయ నాయకులు నిలవాలని అన్నారు. చిట్యాల పట్టణంలోని తన గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత పది సంవ త్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా గత పది సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని చెప్పారు.చిన్న ,చిన్న సమస్యలు చిన్న ఇల్లు కట్టిన వస్తున్నాయి. అలాంటిది అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీ వైపే ఉంటారన్నారు. సీఎం కేసీఆర్ పైన సంపూర్ణ నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉంది. టూరిస్ట్ నాయకులు చెప్పే అసత్యాలు నమ్మరని, కాంగ్రెస్ నేతలకు మళ్లీ అవకాశం ఇస్తే రాష్టాన్ని అధోగతిపాలు చేస్తారని హెచ్చరించారు.