12.2 C
New York
Wednesday, April 24, 2024

రాజ్యసభ కోసం పార్టీల కసరత్తు

- Advertisement -

రాజ్యసభ కోసం పార్టీల కసరత్తు
విజయవాడ, జనవరి 30,
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డటంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన పార్టీలు లెక్క‌లేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విష‌యంలో అన‌ర్హ‌త వేటు అంశం కొలిక్కి చేర‌డంతో ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు. వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీకి రాజ్య‌స‌భ సీటు దక్కించుకునేంత బ‌లం లేక‌పోయిన‌ప్ప‌టికీ గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల మాదిరిగా ఏదొక‌టి జ‌ర‌గ‌క‌పోతుందా అనే ఆశ‌తో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మూడు రాజ్యసభ స‌భ్యుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి.తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగుస్తుండటంతో రాష్ట్రంలో మూడు సీట్లకు ఎన్నికలు జర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ ఎన్నిల‌కు సంబంధించి షెడ్యూల్ కూడా విడుద‌ల అయింది… సాధారణంగా ప్ర‌స్తుతం ఉన్న పరిస్దితుల్లో ఈ మూడు ఎంపీ సీట్లను అసెంబ్లీలో పూర్తి మెజారిటీ కలిగిన వైసీపీ గెల్చుకోవాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ మారిన పరిస్ధితులతో వీటిపై ఉత్కంఠ నెలకొంది. మూడేళ్ల క్రితం త‌న‌ పదవికి రాజీనామా చేసిన‌ గంటా శ్రీనివాస్ రాజీనామాన‌ను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. అలాగే మూడేళ్లుగా పార్టీలు మారిన మరో 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత వేటు ప్ర‌క్రియ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. స్పీక‌ర్ నిర్ణ‌యం వెలువ‌డిన త‌ర్వాత దానిక‌నుగుణంగా ఎమ్మెల్యేల లెక్క తేల‌నుంది. ఈలోగా మూడు సీట్ల‌కు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు వైసీపీ అధినేత జ‌గ‌న్.ఏ రాష్ట్రంలో అయినా రాజ్యసభ ఎన్నికల్లో ఖాళీ అయిన సీట్లు, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే సీట్ల లెక్క ఆధారంగా నిర్ణ‌యిస్తారు. దీని ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో మొత్తం సీట్లు 175 ఉన్నాయి. ఈ లెక్క‌న చూస్తే ఒక్కో సీటుకు 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం అవుతాయి. ఒక‌వేళ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటుప‌డితే 8 మంది ఎమ్మెల్యేల‌తో పాటు గంటా శ్రీనివాస్ కూడా లెక్క‌లోకి వ‌స్తారు. ఇక ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ లెక్క‌న ప‌దిమంది ఎమ్మెల్యేల‌ను తీసివేస్తే మిగిలిన 165 సీట్ల ప్ర‌కారం ఒక్కో ఎంపీ అభ్య‌ర్ధికి 41 మంది ఓట్లు అవ‌సరం అవుతాయి. ఎలా చూసినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే ఇబ్బంది ఏమీ ఉండ‌దు.దీంతో ఈ మూడు స్థానాలు త‌మ‌కే ద‌క్కుతాయ‌నే న‌మ్మ‌కంతో అభ్య‌ర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మొత్తం మూడు స్థానాల‌కోసం ముగ్గురు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వీరిలో పాయ‌క‌రావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉన్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన గొల్ల బాబూరావు మొద‌టి నుంచీ పార్టీపై, సీఎం జ‌గ‌న్ పై విధేయ‌త‌గా ఉన్నారు. తాజాగా ఈయ‌న స్థానంలో మ‌రొక‌రికి ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా అవ‌కాశం ఇచ్చి గొల్ల బాబూరావును రాజ్య‌స‌భ‌కు పంపాల‌నే ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలిసింది. ఇక ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోనే రాజ్య‌స‌భ‌కు వైవీ సుబ్బారెడ్డి పేరు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో ఉన్న ప‌లు సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా సుబ్బారెడ్డికి అవ‌కాశం ద‌క్క‌లేదు.ఈసారి వైవీకి సీఎం జ‌గ‌న్ అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు చిత్తూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. శ్రీనివాసులు ఇప్ప‌టికే మూడుసార్లు సీఎం క్యాంప్ కార్యాల‌యానికి వ‌చ్చి వెళ్లారు. బ‌లిజ సామాజిక వ‌ర్గంలో శ్రీనివాసులుకు మంచి పేరు ఉండ‌టంతో ఈయ‌న పేరు కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు క‌డ‌ప జిల్లాకు చెందిన మేడా ర‌ఘునాధ‌రెడ్డిని కూడా పెద్ద‌ల స‌భ‌కు పంపించే ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున రెడ్డికి స్వ‌యంగా సోద‌రుడు మేడా ర‌ఘునాధ‌రెడ్డి… గ‌తంలోనే ర‌ఘునాధ‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ప్ప‌టికీ మ‌ల్లిఖార్జున రెడ్డికి ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వ‌డంతో ఈయ‌న‌కు చాన్స్ ఇవ్వ‌లేదు.దీంతో ఈసారి ర‌ఘునాధ‌రెడ్డికి అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం.ఈ న‌లుగురిలో త్వ‌ర‌లో ముగ్గురు పేర్ల‌ను అధిష్టానం అధికారికంగా ఖ‌రారుచేసే అవ‌కాశం ఉందంటున్నారు పార్టీలోని ముఖ్య‌నేత‌లు…ఈసారి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌తో రాజ్య‌స‌భ‌లో తెలుగుదేశం పార్టీ ప్రాతినిథ్యం పూర్తిగా కోల్పోనుండ‌గా వైసీపీ బలం పెర‌గ‌నుంది.
టీడీపీ బరిలో వర్ల రామయ్య, కోనేరు సురేష్
గ‌తంలో ఆంధ్రప్రదేశ్ శాస‌న‌మండ‌లికి జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఒక సీటు ద‌క్కించుకుంది. టీడీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన పంచుమ‌ర్తి అనురాధ గెలుపుతో ఒక ఎమ్మెల్సీ స్థానం కైవ‌సం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి,మేక‌పాటి చంద్రశేఖ‌ర్ రెడ్డితో పాటు ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేసారు. దీంతో వైఎస్సార్‎సీపీకి భారీగా న‌ష్టం జ‌రిగింది. అయితే ఈసారి ఇలాంటి ప‌రిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త ప‌డుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక సీటు త‌మ‌కే వ‌స్తుంద‌ని ధీమా వ్యక్తం చేస్తుంది. అందుకే రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో త‌మ అభ్యర్ధిని బ‌రిలో దింపుతామంటున్నారు ఆ పార్టీ నేతలు.తెలుగుదేశం పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం 23 స్థానాలు గెల‌వ‌గా వారిలో న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీ చెంత చేరారు. మ‌రో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించారు. దీంతో టీడీపీకి కేవ‌లం18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల అన‌ర్హత పై స్పీక‌ర్ నిర్ణయం తీసుకుంటే ఒక్కో రాజ్యస‌భ స్థానానికి 41 మంది ఎమ్మెల్యేల బ‌లం అవ‌స‌రం ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా టీడీపీ విజ‌యానికి అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అయినా రాజ్యస‌భ ఎన్నిక‌ల కోసం ఇద్దరి పేర్లు ప‌రిశీలిస్తుంది టీడీపీ అధిష్టానం. టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్యతో పాటు టీడీఎల్పీ ఎల‌క్షన్ కోఆర్డినేట‌ర్ కోనేరు సురేష్ పేర్లను ప‌రిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే త‌మ‌కు బ‌లం త‌క్కువ‌గా ఉన్నప్పటికీ పోటీలో అభ్యర్ధిని నిల‌బెట్టడానికి కార‌ణం లేక‌పోలేదంటున్నారు ఆపార్టీ నేత‌లు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!