సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్ వీడియో
విజయవాడ, రాజమండ్రి, మార్చి 31
Pastor video shaking up social media
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైకు మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉద్యమం లాంటిది జరిగింది. హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని పాస్టర్ సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతో ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించడం తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించింది అంటూ ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.సోమవారం రాత్రి ఆయన వైన్స్ షాపులో మద్యం కొనుగోలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మద్యం మత్తులోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయి ఉంటారని కొత్త ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. వైన్స్ షాపులో మద్యం కొన్న వ్యక్తి ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొన్న తరువాత ఆయన నిజంగానే సేవించారా, మద్యం సేవించి బైకు నడిపారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ వైరల్ వీడియోపై పోలీసులు, అధికారులుగానీ ఎవరూ స్పందించలేదు.ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్‌పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు రహదారిలో గాయాలతో ఆయన డెడ్ బాడీ కనిపించింది. అప్పటివరకూ ప్రతి మూమెంట్‌ను పోలీసులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. కీసర- పొట్టిపాడు మధ్య విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ స్టేం చేశారు, 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11:42 గంటల మధ్య ఏం జరిగింది, ఆయన ఎవరెవరినీ కలిశారనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు.పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమా నాస్పద మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి విచారణ చేపట్టాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత సైతం పోలీసులను విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీసు ప్రవీణ్ పగడాల మృతి కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన సమయంగా భావిస్తున్న టైంలో అటువైపు నుంచి వెళ్తున్న వాహనాల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. చివరి మూడు, నాలుగు గంటలు ప్రవీణ్ ఏం చేశారు. ఎవరిని కలిశారు, ఏమైనా గొడవ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.పాస్టర్ ప్రవీణ్ ది కచ్చితంగా హత్యేనని ఆయన చనిపోయారని పోలీసులు నిర్ధారించిన సమయం తరువాత సైతం ఆయన ఫోన్ నుంచి మెస్సేజ్ లు ఎలా వెళ్లాయని తోటి పాస్టర్లు ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి.ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పద మృతి కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ ఇటీవల ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు ప్రవీణ్ పగడాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.