పైన పటారం… లోన లొటారం
Pataram above...Lotaram below
హైదరాబాద్, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
బీఆర్‌ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. బావా, బావ మరుదులు అయిన హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కవిత తనదారి తాను చూసుకుంటోంది.తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఆ పార్టీ కూడా ఆ సెంటిమెంటునే అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. కష్టం వచ్చిన ప్రతీసారి ఆ పార్టీ నేతలకు జై తెలంగాణ నినాదం గుర్తొస్తుంది. ఇక ఎంత సెంటుమెంటు రాజకీయాలు చేసినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. ఓటమికి అనేక కారాణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్ననన్ని రోజులు అందరూ కేసీఆర్ మాటకు కట్టుబడి పనిచేశారు. కాదు చేసినట్లు నటించారు. అధికారం పోగానే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు మధ్య కూడా పొసగడం లేదని తెలుస్తోంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక కవిత తన సొంత జిల్లా నిజామాబాద్ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ తరుణంలో కేటీఆర్, హరీశ్‌రావు ఎవరికి వారు అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. కేడర్ మద్దతు కోసం ఒకరిని మించి ఒకరు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీలో కొత్త చర్చకు దారితీశారుఅధికారం కోల్పయి డీలా పడిన కారు పార్టీకి మరమ్మతులు చేయాల్సిన గులాబీ అధినేత కేసీఆర్.. పట్టించుకోవడం మానేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఆయన.. ఓడించిన ప్రజలతో మాకేం పని అన్నట్లు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా ఫాంహౌస్‌కు తనను కలిసేందుకు వచ్చేవారితో మీటింగ్‌లు పెడుతూ టైంపాస్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో బీఆర్‌ఎస్ బరువు, బాధ్యతలు మోస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పుడు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్‌ను తమవైపు తిప్పుకోవడానికి పోటీ పడుతున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు.పదవీకాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఇటీవల గులాబీ నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ హాజరవుతారని అంతా భావించారు. తీరా చూస్తే కేటీఆర్ ఒక్కరే వచ్చారు. తాజాగా అంబేద్కర్ విగ్రహాలను వేర్వేరుగా ఇద్దరూ ఒకేరోజు ఆవిష్కరించడం చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఒకేరోజు ఇద్దరు వేర్వేరుగా ఆవిష్కరించడం తెలంగాణలో వైరల్‌గా మారింది. బీఆర్‌ఎస్‌లో అనైక్యత ఇప్పుడు కోల్డ్ వార్‌ను బయట పెడుతున్నాయి.గులాబీలో కీలక నేతలు అయిన కేటీఆర్, హరీశ్‌రావు మధ్య ఎప్పటి నుంచో కోల్డ్‌వార్ జరుగుతోంది. కానీ, పైకి ఐక్యతారాగం జపిస్తున్నాన్న వాదనలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కలిసి ఉండకుంటే బాగుండదు అన్నట్లుగా ఉన్నారు.కానీ ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నట్లు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు చూస్తే అర్థమవుతోంది. ఇద్దరి నేతల తీరుతలో కేడర్‌లో అయోమయం నెలకొంది. మరి దీనిని కేసీఆర్ ఎలా సరిదిద్దుతారో చూడాలి