పవన్ పొలిటికల్ జర్నీ…
Pawan's political journey...

పిఠాపురం, మార్చి 14,
పవన్ కల్యాణ్ పేరు వింటే చాలు ఆయన అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తుంది. వారికి ఆయన పేరే ఒక బ్రాండ్. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ప్రవేశించారు. చిరంజీవి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. పవన్ కల్యాన్ తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులతో పాటు సొంతంగా తనకంటూ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే జనాల్లో తనకున్న క్రేజ్ దృష్ట్యా చిరంజీవి.. రాజకీయ రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని ప్రారంభించారు. ఆ సమయంలో పీఆర్పీ యూత్ వింగ్ (యువరాజ్యం) బాధ్యతలను పవన్ కల్యాణ్ చేపట్టారు. దీంతో ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్.. పీఆర్పీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే పీఆర్పీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో రోడ్ షో సందర్భంగా పవన్ చేయి విద్యుత్తు వైర్లకు తగలడంతో ఆయనకు షాక్ తగిలింది. అయితే ఈ ప్రమాదం నుంచి పవన్ బయటపడటంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పుడు కొండగట్టు అంజన్న స్వామి తనకు పునర్జన్మ ప్రసాదించారని పవన్ ఇప్పటికీ చెబుతుంటారు.ఇదిలా ఉంటే, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 20 లోపు సీట్లకు మాత్రమే పరిమితమైంది. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు ప్రతిపక్ష పార్టీగా కొనసాగిన పీఆర్పీని.. చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పవన్ మాత్రం కాంగ్రెస్ వైపు చూడలేదు. కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ సరికొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు తన సోదరుడు యూపీఏ-2 హయంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతుంటే.. జనసేన పేరుతో పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో అన్నయ్యతో సంబంధం లేకుండానే అడుగులు వేశారు. అయితే ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పవన్ కల్యాణ్ ఎలాంటి పదవి తీసుకోలేదు. కొన్నాళ్లు టీడీపీ, జనసేనల మధ్య సఖ్యత బాగానే ఉంది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో చీలిక వచ్చింది. ఇటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై.. అటూ కేంద్రంలోని బీజేపీపై పవన్ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర నిధుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ-బీజేపీలు కూడా విడిపోయాయి. పవన్ కల్యాణ్ కూడా ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా జనసేన దూరంగా ఉంది. ఇక, 2019లో జనసేన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి జనసేన.. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచింది. తనకు సినిమాలపై ఇంట్రస్ట్ లేదని.. పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని కూడా పవన్ ప్రకటన కూడా చేశారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు పవన్ కల్యాణ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. మొత్తం జనసేన నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే జనసేన నుంచి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ కూడా కొంతకాలానికే పార్టీకి దూరమయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పార్టీ కూడా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇక, పవన్ కల్యాణ్ కూడా ఏపీలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీతో మరోసారి చేతులు కలిపారు. అయితే బీజేపీ-జనసేనలు పొత్తులో ఉన్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. బీజేపీ రాష్ట్ర నాయకులకు, పవన్‌కు మధ్య చర్చలు అనే ప్రసక్తే లేకుండా పోయింది. ఇరు పార్టీల తీరు గమనిస్తే వారు పొత్తులో ఉన్నారంటే నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సినిమాల్లో నటించనని చెప్పిన పవన్ కల్యాణ్.. తిరిగి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అయితే తన పార్టీని నడిపించడానికి అవసరమైన నిధులను సమకూర్చొవడానికే తాను తిరిగి సినిమాలు చేస్తున్నానని.. ప్రజా సేవ చేయడమే తన రాజకీయం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వైసీపీ నుంచి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. మరోవైపు ఏపీలో పవన్ కల్యాణ్ చిత్రాల విడుదల సమయంలో పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. అయితే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రకటన తర్వాత వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్, విశాఖలో ఆయన పర్యటన చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర దుమారమే రేపాయి. విశాఖ ఘటన తర్వాత చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్‌తో సమావేశమయ్యారు. దీంతో అప్పటినుంచి జనసేన-టీడీపీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై చర్చ మొదలైంది. వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చూస్తానని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని కూడా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రెండు, మూడు సందర్భాల్లో భేటీ అయ్యారు. అయితే ఇరుపార్టీల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అధికార ప్రకటన మాత్రం రావడం లేదు. ఇక, వారాహి యాత్రలో జనాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు విశేష ఆదరణ లభించింది.. సీఎం జగన్ విధానాలను, వాలంటీర్ వ్యవస్థను, డేటా చోరీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేపాయి. దీంతో వైసీపీ, జనసేనల మధ్య తీవ్ర మాట యుద్దం కొనసాగింది. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో కొనసాగుతుండటంతో.. పలు సందర్భాల్లో ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవితో పోల్చుతూ పవన్‌ను విమర్శించడం, పవన్ పెళ్లిళ్ల గురించి తరుచూ ప్రస్తావించడం.. నిజానికి ఆయనకు ఇబ్బంది కలిగించే అంశాలుగానే ఉన్నాయి. అయితే తాను విధానాల గురించి మాట్లాడితే.. సమస్యలను పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగత జీవితం గురించి వైసీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారని పవన్ చెబుతారు. ఇక, ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో సక్సెస్ ఫుల్ పొలిటిషియన్ గా పేరుతెచ్చుకున్నారు.