పెదకాకాని: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
Pedakakani: Tragedy took place in Guntur districtపెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర స్వగ్రామానికి బయల్దేరాడు. మురుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా వెళ్లడంతో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతోపాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్, మానిక్‌లు మృతిచెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.




