ఖమ్మం, నల్గోండ, నవంబర్ 22, (వాయిస్ టుడే): మాటల మరాఠీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక్కసారి ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వాళ్ళని అవలీలగా తన మాట వినేలా చేసుకోగల నేర్పరి అని పేరుంది. తనదైన శైలిలో ప్రసంగాలతో ఆకట్టుకోగల నైపుణ్యం ఆయన సొంతం. తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన కేసీఆర్, తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. తొమ్మిదేళ్ల ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లారు. ముఖ్యంగా సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకోవడంలో కేసీఆర్ ది అందె వేసిన చేయి. గత రెండు ఎన్నికలలో తెలంగాణ స్వాభిమానం పేరిట కేసీఆర్ ఎన్నికల రాజకీయం నడిచింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగాలలో కాస్త పస తగ్గిందన్న భావన వ్యక్తమవుతున్న మాట నిజమే. అయితే ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల పేరిట బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి పరాయి పాలకులు, ఢిల్లీ గులాములు వంటి విమర్శలు చేయడానికి కేసీఆర్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సెంటిమెంట్ రగిలించడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ఆకాంక్ష కోసం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక పరాయి పాలకులు, ఢిల్లీ గులాములు అంటూ కేసీఆర్ గత ఎన్నికలలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలని టార్గెట్ చేసి తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రగిలించగా.. ఇప్పుడు ప్రచారంలో ఆ విమర్శలకు కేసీఆర్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈసారి తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది.. కేసీఆర్ ఆ మధ్య వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఆయన బీఆర్ఎస్ కూడా పరాయి పార్టీనే అవుతుంది. దీంతో ఈసారి ఆ విమర్శ పెద్దగా ప్రజలకు ఎక్కదు. అందుకే కేసీఆర్ ఈసారి స్టైల్ మార్చారు ఈ ఎన్నికలకు తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండడంతో ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తెలంగాణ ఎన్నికలలో కీలకంగా మారాయి. దీంతో అన్ని పార్టీలు తెలుగుదేశం ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కారణాలు ఏమైనా వారంతా ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నది. సరిగ్గా ఇప్పుడు ఇదే అంశాన్ని కేసీఆర్ ఓ అస్త్రం మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ హయాంలో ఆనాటి పరిస్థితులను, ఎన్టీఆర్ పార్టీ స్థాపన కారణాలను వివరిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు మళ్ళీ తీసుకొస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఆకలితో అల్లాల్లాడుతూంటేనే కదా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి వచ్చి కిలో రెండు రూపాయల బియ్యం లాంటి పథకాలను తెచ్చి వారి ఆకలి తీర్చిందని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ హయాంలో అంత అద్భుతమైన పాలన చేసి ఉంటే అసలు తెలుగుదేశం ఎందుకు ఆవిర్భవించేదని కేసీఆర్ ప్రశ్నించారు.కేసీఆర్ ఈ మాటల వెనక చాలా అర్ధం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే స్థాయికి దూసుకొచ్చింది. అందుకు తెలుగుదేశం క్యాడర్ కూడా సహకరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కేసీఆర్ ఒకే విమర్శతో అటు కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ.. తెలుగుదేశం ఆవిర్భావానికి కాంగ్రెస్ దుష్టపాలనే కారణమని చెబుతూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆనాటి పరిస్థితులే వస్తాయని చెప్తూనే, ఆనాటి పరిస్థితులు తెచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు తెలుగుదేశం ఎలా మద్దతు ఇస్తుందన్న చర్చ జరిగేలా చేయడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ను కీర్తిస్తూ తెలుగుదేశం క్యాడర్ ను కాంగ్రెస్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ప్రసంగాలలో ఈ వ్యూహం బయట పెడుతుండగా.. మిగిలిన ఈ వారం ప్రసంగాలలో కేసీఆర్ ఇదే అంశంపై మరింత లోతుగా మాట్లాడే అవకాశం కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉండబోతున్నదన్నది ఆసక్తిగా మారింది.