స్వరూపానందేంద్ర స్వామి
చాతుర్మాస్య దీక్ష విరమణ అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి శనివారం రిషికేష్ నుంచి విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు పీఠం భక్తులు స్వాగతం పలికారు. అనంతరం చినముషిడివాడలోని పీఠానికి చేరుకున్న స్వామీజీకి భక్తులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాజశ్యామలతో పాటు ఇతర దేవతామూర్తుల ఆలయాలలో స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ హిమాలయ పాద ప్రాంతంలో చాతుర్మాస్య దీక్ష విజయవంతంగా సాగిందని అన్నారు. గంగాతీరంలో సనాతన, వైదిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామని తెలిపారు. రాజశ్యామల ఆరాధనతో దీక్షా కాలం ప్రశాంతంగా సాగిందని అన్నారు. సింహాచలం అప్పన్న సన్నిధికి చేరుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో కొత్త ఒరవడి సృష్టించేలా వైదికపరమైన ప్రణాళికలు రచించామని స్వరూపానందేంద్ర స్వామి వివరించారు. విశాఖ శారదా పీఠం కార్యక్రమాల విస్తరణలో భాగంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో నూతన ఆశ్రమాలు నిర్మించదలిచామని ప్రకటించారు