
భళా సి.పి. గారూ..! భళా..!!
ఇటీవలి వర్షాలతో వరదల్లో సాహసోపేతమైన పోలీసుల సత్వర సేవలకు ఫిదా…!
సీపీకి ఎన్టీఆర్ కాలనీ వాసుల కృతజ్ఞతలు…
వరంగల్ క్రైమ్ బ్యూరో ఆగస్టు 9 ( వాయిస్ టుడే ప్రతినిధి) ఇటీవల ఓరుగల్లును వరదలు ముంచెత్తిన సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన పోలీసులకు వరంగల్ ఎన్టీఆర్ కాలనీ వాసులు కృతజ్ఞాతాభినందనలు తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలోని పోలీసు బృందం రేయింబవళ్లు శ్రమించి ప్రాణ నష్టం జరగకుండ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. స్వయంగా వరంగల్ కొత్వాల్ ఎ.వి. రంగనాథ్ ట్రాక్టర్ పై ఎన్టీఆర్ కాలనీలో పర్యటించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ పనితీరును ఎన్టీఆర్ కాలనీ వాసులు ప్రశంసించారు. అంతే కాకుండా సిపి సూచనల మేరకు ఎన్నో సాహసోపేతమైన సేవలను అందించిన పోలీస్ సిబ్బంది అందరికీ సైతం కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ఎన్. టి . ఆర్ కాలనీ వాసులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పోలీసుల చొరవను కాలనీ వాసులు తలుచుకుంటూ… వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ కు కాలనీ వాసులు ప్రత్యక్షంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులకు పోలీసులు అందించిన బరోసాను కొనియాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడు, నీడగా నిలిచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆహార పదార్థాలు అందించే చొరవ చూపిన అధికారులను అభినందించారు. వరంగల్ సిపి వెంట ఏసీపీ బోనాల కిషన్, మట్వాడా ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.



