Sunday, September 8, 2024

మూడు పదుల వయస్సులో పొలిటికల్ ఎంట్రీ

- Advertisement -
Political entry in the thirties
Political entry in the thirties

హైదరాబాద్, నవంబర్ 18, (వాయిస్ టుడే):  తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌ తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు నేతలు. అయితే, ఈసారి పెద్దసంఖ్యలో యువత నామినేషన్స్‌ వేశారు. మూడు పదుల వయసులోనే కదనరంగంలోకి దూకుతున్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి తక్కువ వయసున్న వారిలో యశస్వినిరెడ్డి ఒకరు. 26ఏళ్ల యశస్వినిరెడ్డి.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనూహ్యంగా బరిలో నిలిచారు. 2018లో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె.. ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డి కుమారుడితో మ్యారేజ్‌ తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. ఐతే ఝాన్సీరెడ్డికి ఉన్న అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారడంతో కోడలు యశస్వినిరెడ్డి పోటీ చేస్తున్నారు.  ఎంతో సీనియరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఢీ కొంటున్న ఆమె.. పాలకుర్తిలో గెలుపు తనదేనంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దీంతో ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది పాలకుర్తి రాజకీయం. ఇక 30ఏళ్ల పర్ణికారెడ్డి.. నారాయణపేట నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలో నిలిచారు. ప్రస్తుతం మెడిసిన్‌లో పీజీ చేస్తున్నారు. ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో మావోయిస్టుల కాల్పుల్లో నర్సిరెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రెడ్డి మరణించారు. ఆ తర్వాత వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ..పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా నిలుస్తూ వస్తున్నారు ఆమె మేనమామ శివకుమార్‌రెడ్డి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైనా.. నియోజకవర్గంలో తనదైనశైలిలో రాజకీయాలు నడిపిస్తూ మరోసారి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కానీ మహిళా కోటాలో ఆయన మేనకోడలైన చిట్టెం పర్ణికా రెడ్డి పోటీలో నిలిచారు. పర్ణికారెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి తమ్ముని కుమార్తె. అంతేకాదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు సైతం స్వయానా మేనకోడలు. చిట్టెం వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన పర్ణికా రెడ్డి.. తాత, తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమంటూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. నారాయణపేటలో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు 27ఏళ్ల దాసరి ఉష. ఓదెల మండలం కనగర్తికి చెందిన ఈమె.. 2018లో ఖరగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశారు. కొన్నాళ్లు విద్యార్థులకు ట్యూషన్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పెద్దపల్లిలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ఆమె కృషి, పనితీరు చూసిన పార్టీ అధిష్టానం ఉషకు పెద్దపల్లి టికెట్‌ను ఖరారు చేసింది. 35ఏళ్లలోపు ఉన్నవారు 55మంది నామినేషన్లు వేశారు. కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు బర్రెలక్కగా గుర్తింపు పొందిన శిరీష. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నమోదైన నామినేషన్లలో అతి తక్కువ వయసున్న శిరీష.. నిరుద్యోగ యువత తరపున నామినేషన్‌ వేసినట్టు ప్రకటించారు.ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడైన 26 ఏళ్ల రోహిత్‌రావు.. కాంగ్రెస్‌ టికెట్‌పై మెదక్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన రోహిత్‌.. హైదరాబాద్‌లో డాక్టర్‌గా చేస్తూనే.. మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. రోహిత్‌కు బీఆర్‌ఎస్‌కు టికెట్‌ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్