హైదరాబాద్, నవంబర్ 17, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వారసులు తళుక్కుమంటున్నారు. కొందరు నేతలు రెస్ట్ తీసుకుని.. తమ వారసులను రంగంలోకి దింపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తరతరాలుగా రాజకీయాల్లో ఉన్న కొన్ని కుటుంబాల నుంచి వస్తున్న యువ నాయకులు తమ సత్తా నిరూపించుకుంటారా? ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారసులు.. రాజకీయాల్లో తలపండిన నేతలను ఎలా ఢీకొంటారన్నదే ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇంతకీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ రాజకీయ వారసులెవరు?తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి వారసుల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువ నేతలు.. ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవాలని రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల నుంచి వారసులకు టికెట్లు ఇవ్వడంతో ఆయా స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నవతరం.. సీనియర్లను ఢీకొంటుండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.కొత్తగా పోటీ చేస్తున్న వారసుల్లో కొందరు ఎప్పటినుంచో క్షేత్రస్థాయిలో తిరిగిన వారు కాగా.. మరికొంతమంది మాత్రం ఎలాంటి అనుభవం లేకుండానే సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అధికార బీఆర్‌ఎస్ నుంచి కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్‌లో వారసుల కోటాలో ఒక్క సంజయ్‌కు మాత్రమే గులాబీబాస్ అవకాశం ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావు కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు వారసులకు మరో రాజకీయ వారసుడు, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
ఇలా కోరుట్ల నియోజకవర్గంలో వారసుల సంగ్రామం ఆసక్తికరంగా మారింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ నుంచి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్‌రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదట వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ పేరు ఖరారు చేసిన బీజేపీ.. చివరి నిమిషంలో వికాస్‌రావుకు బీ ఫామ్ ఇచ్చింది. దీంతో విద్యాసాగర్‌రావు వారసుడిగా వికాస్‌రావు తన అధృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న వొడితెల ప్రణవ్‌బాబు కూడా రాజకీయ వారసుడే. ఈయన కుటుంబం మొత్తం బీఆర్‌ఎస్‌లో ఉండగా.. హుజురాబాద్‌లో పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రణవ్‌బాబు. సెకండ్ లిస్టులో ప్రణవ్‌కు సీటు ఖరారు చేసిన కాంగ్రెస్.. సీనియర్ నేత ఈటల.. పాడి కౌశిక్‌రెడ్డికి సవాల్ విసురుతోంది.కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో ఆయన వారసత్వంగా కుమార్తె లాస్య నందితకు కూడా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ కాస్తా ఎక్కువగా వారసులకు పెద్దపీట వేసింది. కంటోన్మెంట్ నుంచి ప్రజాయుద్ధనౌక గద్దర్ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేశారు డాక్టర్ వెన్నెల. విప్లప రాజకీయాల్లో.. ప్రజా ఉద్యమాల నిర్మాతగా తెలంగాణలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గద్దర్ కుటుంబం ఎన్నడూ రాజకీయాల్లో లేకపోయినా.. ఆయన చివరి రోజుల్లో కాంగ్రెస్‌తో అనుబంధం ఏర్పరుచుకున్నారు. దీంతో గద్దర్ వారసురాలికి కంటోన్మెంట్ సీటు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది హస్తం పార్టీ. ఇదే జిల్లాలో బీజేపీ కూడా ఓ వారసుడిని తెరపైకి తెచ్చింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది కమలం పార్టీ. వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేసే బీజేపీకి మహబూబ్‌నగర్‌లో వేరే ప్రత్యామ్నాయం లేక మిథున్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న జితేందర్‌రెడ్డి వారసుడిగా మిథున్‌రెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ప్రస్తుతం కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్న విజయారెడ్డి తండ్రి వారసురాలిగా ఎమ్మెల్యే కావాలని 2009 నుంచి కలలు కంటున్నారు. 2009 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన విజయారెడ్డి ఓడిపోగా.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతున్నారు విజయారెడ్డి. విజయారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఆమె సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డికి మొండిచెయ్యి ఇచ్చింది.మెదక్‌లో బీఆర్‌ఎస్ సీటు ఆశించి భంగపడిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌రావుకు కాంగ్రెస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చి.. మెదక్ టికెట్ కట్టబెట్టింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్ నాగార్జునసాగర్ నుంచి బరిలో ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే రాజకీయ వారసుడిగా ఎమ్మెల్యేగా గెలిచిన నోముల భగత్‌తో జయవీర్ ఢీకొంటున్నారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఈసారి రాజకీయ వారసులు బరిలో ఉన్నారు. మరి హోరాహోరీగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ యుద్ధంలో ఎంతమంది వారసులు గెలిచి.. చట్టసభల్లో అడుగుపెడుతారో చూడాలి