22.1 C
New York
Friday, May 31, 2024

 నిజామాబాద్ లో వేడిపుట్టిస్తున్న రాజకీయాలు

- Advertisement -

 నిజామాబాద్ లో వేడిపుట్టిస్తున్న రాజకీయాలు
నిజామాబాద్, మే6, (వాయిస్ టుడే )
నిజామాబాద్‌లో ఓ వైపు భానుడి ప్రతాపానికి ఊష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుంటే, మరోవైపు పార్లమెంట్ పరిధిలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది.. పార్టీల అభ్యర్దులు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేలుస్తూ వేడి సెగలు పుట్టిస్తున్నారు. ప్రచారంలో స్పీడు పెంచిన నేతలు అదే స్దాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్ది జీవన్ రెడ్డిల మద్య మాటల యుద్దం కొనసాగుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్ది బాజిరెడ్డి గోవర్దన్ సైతం ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి జై కొడతారో తెలియదు కానీ, నేతలు మాత్రం నువ్వా – నేనా అన్నట్లు తమ మాటలతో తలపడుతూ కాకరేపుతున్నారు.లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్‌లో త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటూ, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్దులు ఒకే రీతిలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు పార్టీల అభ్యర్దులు ఒకే మండలంలో ఒకే రోజు ప్రచారాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ వెళ్ళిన చోటుకు వెంటనే బీజేపి అభ్యర్ది వెళ్ళటం, ఆవెంటనే అదే గ్రామానికి బీఆర్ఎస్ అభ్యర్ది వెళ్ళి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల ఈ ముగ్గురు అభ్యర్దులు కూడా నిజామాబాద్ రూరల్‌లోని ఇందల్వాయి , డిచ్‌పల్లి మండలాలలో ప్రచారాలు నిర్వహించారు. అటు జగిత్యాల కోరుట్ల మెట్‌పల్లిలో కూడా మూడు పార్టీల అభ్యర్దులు వరస పెట్టి పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించారు.ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట బీజేపీ అభ్యర్ది ధర్మపురి అర్వింద్ ప్రచారం చేపట్టగా వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్దులు అక్కడికి చేరుకుని పోటా పోటీగా ప్రచారం చేపట్టారు. పలు కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. భానుడి ప్రతాపానికి ఉమ్మడి నిజామాద్ జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా నేతలు మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారాలు చేస్తూ మరింత వేడి పుట్టిస్తున్నారు.ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైళిలో ప్రత్యర్దులపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ది జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కూడా విరుచుకుపడుతున్నారు. 75 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ అభ్యర్ది జీవన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలపై రోజు నిలదీస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఒక వర్గానికే మేలు జరుగుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ప్రచారం నిర్వహిస్తూనే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కేంద్రం తెలంగాణాకు ఇచ్చింది గాడిద గుడ్డు అనే అంశాన్ని ప్రదాన ఎన్నికల అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్ది బాజిరెడ్డి గోవర్దన్ కూడా ఈ రెండు పార్టీలపై విరుచుకుపడుతున్నారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చి రైతులను మోసం చేసిన అర్వింద్ కు పసుపు బోర్డు ఎక్కడా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తున్నారు. జిల్లాలో కరెంట్ కోతలు, సాగునీటి సమస్యలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేస్తూ ప్రచారం నిర్వహిస్తు భానుడి ప్రతాపానికి తోడు రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!