28.7 C
New York
Sunday, June 23, 2024

వరంగల్ లో దేవాదాయ భూములు కబ్జా

- Advertisement -

వరంగల్ లో దేవాదాయ భూములు కబ్జా
వరంగల్, ఏప్రిల్ 16,
ఎంతో చారిత్రాత్మక నేపథ్యం గల ఓరుగల్లు నగరంలో వందల కోట్ల విలువైన దేవుడి భూములు కబ్జాకు గురవుతున్నాయి. తాజాగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని రూ.400 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జా వ్యవహారం వెలుగులోకి రావటంతో నగర పౌరులు భగ్గుమంటున్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో అక్రమార్కులు భూకబ్జాలకు పాల్పడుతున్నా, దేవాదాయ శాఖ అధికారుల చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కాజిపేటలోని ఆలయాల భూములు బహిరంగంగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలకు దిగిన కబ్జాకోరులపై ఒక్క చర్యా తీసుకోవకపోవటం వెనక పెద్ద కథే ఉందనే అనుమానాలు వ్యక్తం కావటంతో దేవాదాయ మంత్రి కొండా సురేఖ దీనిపై దృష్టి సారిస్తే తప్ప దేవుడి భూములు మిగలవని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. మొత్తంగా ఈ కబ్జా బాగోతం నేడు వరంగల్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం.. హన్మకొండ పద్మాక్షి ఆలయానికి 72.23 ఎకరాలు, సిద్ధేశ్వర దేవాలయానికి 882, 889, 922 సర్వే నంబర్ లో 24.03 ఎకరాలు, వీర పిచ్చమాంబ కోవెలకు సర్వే నంబర్ 879లో 1.14 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ మొత్తం భూముల్లో 21 ఎకరాల మీద గత బీఆర్ఎస్ హయాంలోనే అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఇవిగాక, హనుమకొండలోని రంగనాయకస్వామి ఆలయానికి బ్రాహ్మణవాడ, ములుగు రోడ్, పెద్దమ్మగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్ నగరంలోని వేణుగోపాలస్వామి గుడికి చెందిన 1.11 ఎకరాల భూమి కూడా కబ్జాదారుల పాలైంది. వీటి విలువ సైతం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొన్నేళ్లుగా పథకం ప్రకారం దశల వారీగా జరుగుతూ వచ్చిన ఈ భూముల కబ్జా వెనక బీఆర్ఎస్ నేతలుండటంతో నాటి దేవాదాయ శాఖ అధికారులు మౌనం వహించారు. నేతల ఆదేశాల మేరకు ఛోటా మోటా నేతలు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో మరొకొందరు ఈ భూములు తమవేనంటూ దర్జాగా కబ్జా చేశారు. ప్రస్తుతం ఇక్కడ గజం స్థలం రూ.45 నుంచి 50 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఎకరం భూమి విలువ సుమారు రూ. 20 నుంచి 25 కోట్లుగా ఉంది. తాజాగా కాజిపేట్ లోని మల్లిఖార్జునస్వామి ఆలయం సర్వే నెంబర్ 206 లో 7 ఎకరాల 8 గుంటల భూమి ఉండగా, దీనిపై కూడ కబ్జాకోరుల కన్నుపడిందని చర్చ సాగుతోంది.దేవుడి భూములను కబ్జా చేసి భవనాలు కట్టారని గతంలో రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ వేదిక ప్రతినిధులు లోకాయుక్త కోర్టుకు ఫిర్యాదు చేయగా, వాటిపై స్పందించిన లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ సీ.వీ రాములు డిజిటల్ సర్వే చేయాలని 2023లో అధికారులను ఆదేశించారు. కబ్జాలు నిజమని తేలితే ఆక్రమణలు కూల్చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డర్ వేశారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతారావు, అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌ల టీమ్ ఎన్నో అవాంతరాల మధ్య సర్వే పూర్తి చేసి 2023 జనవరి 5న కోర్టుకు రిపోర్టు అందజేసింది. పలు ఆలయాలకు చెందిన రూ. 400 కోట్ల విలువైన 20.81 ఎకరాల భూమి కబ్జాకు గురైందని సర్వే కమిటీ నిర్ధారించింది. సర్వే కమిటీ ఇచ్చి 15 నెలలు అవుతున్నా నేటికీ అక్రమ నిర్మాణాలు తొలగించటం గానీ, సరిహద్దులు నిర్ణయించటం గానీ జరగలేదు. అయితే, ఈ కబ్జా బాగోతంలో ఉన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ బడా నేతల ఒత్తిడి మేరకే అధికారులు మొక్కుబడిగా అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు.ఏటా బతుకమ్మ ఆడే సిద్ధేశ్వర ఆలయానికి చెందిన 2.24 ఎకరాలు కబ్జా కాగా, ఇందులోని 9 గుంటల్లో బిఆర్ఎస్ నాయకుడు వరదారెడ్డి ఎస్.ఆర్ కాలేజీ నిర్మాణం చేసారు.పద్మాక్షి టెంపుల్‌కి చెందిన 6.22 ఎకరాలు కబ్జా కాగా, ఆ భూమిలోనే నాటి బీఆర్ఎస్ నేత ప్రధాన అనుచరుడు పెట్రోల్ బంక్ పెట్టేశాడు. ఇందులోని మిగిలిన భూమిలో గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ కార్పోరేటర్ ఒక విద్యాసంస్థ, ఐటీఐ కాలేజీ, ఇతర భవనాలు కట్టిపారేశారు.వీరపిచ్చమాంబ ఆలయానికి చెందిన 30 గుంటలు కబ్జా కాగా, ఇందులోని 20 గుంటల్లో ఓ కార్పొరేటర్ అపార్టుమెంట్ నిర్మించారు.వేణు గోపాలస్వామి ఆలయానికి చెందిన 1.11 ఎకరాల్లో ఓ స్కూల్, గార్డెన్ ఏర్పాటు కాగా, మిగిలిన భూమి 12 మంది స్వాధీనంలో ఉంది.రంగనాయకస్వామి ఆలయానికి చెందిన 9.32 ఎకరాల భూమి 34 మంది కబ్జాలో ఉంది.రూ. 400 కోట్ల విలువైన 21 ఎకరాల దేవుడి భూమి కబ్జా వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. తాము అమ్మిన భూముల్లోనిర్మించిన భవనాలకు దేవాదాయ శాఖ అధికారులు నోటిసులిచ్చి ఖాళీ చేయిస్తే, తమకు డబ్బిచ్చి కొనుక్కున్న వారంతా రోడ్డెక్కి తమ పేర్లు బయటపెడతారని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఈ వ్యవహారంలో నేతలకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులూ అందుకే తూతూ మంత్రంగా నోటీసులిచ్చి కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. కొందరు నేతలు తమ అనుచరులకు భూమిలో వాటా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అనుచరులు దేవాదాయ శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారనీ, ఈ క్రమంలోనే ఒకరిద్దరు ఆఫీసర్లు ఏకంగా ఎండోమెంట్ రికార్డులను మారుస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావటంతో అధికారులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉండగా, ఖాళీగా ఉన్న తమ భూముల్లో కబ్జాదారులు వేగంగా నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కనుక తక్షణం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ వ్యవహారం మీద చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలు జరగకుండా ఆదేశాలివ్వాలని గ్రేటర్ వరంగల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.నగరంలో ఎంతో చరిత్ర గల ఆలయాల భూములు నేతల అండతో కబ్జాకు గురవుతున్నా, అధికారులు మామూళ్లు తీసుకుని చూడనట్లు వదిలేశారు. దేవాలయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. దీనిపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటంతో మేము లోకాయుక్త కోర్టును ఆశ్రయించాము. అక్రమార్కుల మీద చర్యలకు, అక్రమ నిర్మాణాల తొలగింపుకు కోర్టు ఆదేశాలిచ్చినా, దేవాదాయశాఖ, గ్రేటర్ వరంగల్ అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప కఠినమైన చర్యలేమీ తీసుకోవటం లేదు. మరోవైపు దేవుడి భూములు కాపాడాలని పోరాటం చేస్తు్న్న తమను, తమకు సహకరిస్తున్న వ్యక్తులను ఆక్రమణదారులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపై తక్షణం ప్రభుత్వం స్పందించి ఆలయ భూములను కబ్జా చేసినవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని దేవుడి భూములు కాపాడాలి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!