ఖమ్మం కాంగ్రెస్ సీటుకు పొదిల పేరు?
తెరపైకి పొదిల రవికుమార్ అభ్యర్థిత్వం
సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే..
ఇప్పటివరకు ఖమ్మం టికెట్ పెండింగ్
అనూహ్యంగా ముందుకొచ్చిన రవికుమార్
జిల్లాలోని ముగ్గురు కీలక నేతల మద్దతు?
ముఖ్య నేత ముందుకు రవికుమార్ పేరు
(వాయిస్ టుడే హైదరాబాద్ ప్రతినిధి)
రాహుల్ గాంధీ నుంచి వీహెచ్ వరకు.. ఎందరో పేర్లు వినిపించిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. మహామహులు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి పారిశ్రామికవేత్త పొదిల రవికుమార్ ను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల కిందటనే ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు పొదిల రవికుమార్. అయితే, వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడంతోనూ ఖమ్మం పరిధిలో అందరికీ సుపరిచితులుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టికెట్ కు రవికుమార్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్య నేత ముందుకు కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది.
అప్పట్లోనే మంచి పేరు
పొదిల రవికుమార్ గ్రానైట్ సహా పలు వ్యాపారాల్లో ఉన్నారు. 30 ఏళ్ల కిందటనే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆయన గురించి మంచిగా చెప్పేవారు. అయితే, రాజకీయ కారణాలతో 2009 తర్వాత కొందరు ఆయనను వెనక్కులాగారు. దీంతో రవికుమార్ కొన్నాళ్లుగా సామాజిక సేవపైనే ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన మరోసారి వెలుగులోకి వచ్చారు.
సామాజిక సమీకరణాలతో..
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పొదిల రవికుమార్ పేరు తెరపైకి రావడం వెనుక సామాజిక సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఎస్సీ మాల కాగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వర్గాలకు చెందినవారు. దీంతోనే మరో ప్రధాన సామాజిక వర్గం అయిన మున్నూరు కాపులకు టికెట్ ఇస్తే అన్ని వర్గాలను సమానంగా చూసినట్లు అవుతుందని, భారీ సంఖ్యంలో ఓట్లు ఉన్న సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కీలక బీసీ నాయకులేరి?
ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఇలాంటి చోట నుంచి వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) దశాబ్దాల పాటు ఆ పార్టీకి కీలక నేతగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ఈయన 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మున్నూరు కాపులనే కాక బీసీ నాయకులెవరూ ఖమ్మం కాంగ్రెస్ లో లేనట్లయింది. ఆ లోటును ఇప్పుడు పొదిల రవికుమార్ కు టికెట్ ఇవ్వడం ద్వారా భర్తీ చేసే అవకాశం లభించింది.
అత్యంత పోటాపోటీ
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు భట్టి సతీమణి నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల కుమారుడు యుగంధర్ పేర్లు మొదటినుంచి ప్రచారంలో ఉన్నాయి. మధ్యలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా వినిపించింది. కాంగ్రెస్ తరఫున కమ్మ సామాజికవర్గం నేతలకు ఎక్కడా లోక్ సభ టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మలనే స్వయంగా మండవ పేరును ముందుకుతెచ్చారని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (వీహెచ్) సైతం ఖమ్మం టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. వీరందరి మధ్య పొదిల రవికుమార్ పేరు తెరపైకి రావడం గమనార్హం.
పొదిలకు ఇస్తే వీహెచ్ కు ఇచ్చినట్లే..
పొదిల రవికుమార్, వీహెచ్ ఇద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే. పొదిలకు ఖమ్మం టికెట్ ఇస్తే జిల్లాలో గణనీయంగా ఉన్న ఆ వర్గాన్ని ఆదరించినట్లు అవుతుంది. వాస్తవానికి ఖమ్మంలో మొదటినుంచి మున్నూరు కాపులు అత్యధికం కాంగ్రెస్ వైపే నిలిచారు. 1991లో కేంద్ర మాజీ మంత్రి పీవీ రంగయ్యనాయుడిని ఎంపీగా గెలిపించడంలో వీరి పాత్ర కీలక కావడం గమనార్హం. కాగా, పొదిలకు టికెట్ ఇస్తే.. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత మరోసారి కాపు/మున్నూరు కాపు నాయకుడికి ప్రాధాన్యం దక్కినట్లు అవుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ ను అభిమానిస్తున్న మున్నూరు కాపులను గుర్తించినట్లు కూడా అవుతుంది. మరోవైపు అధిష్ఠానం గనుక పొదిల రవికుమార్ కు టికెట్ ఇస్తే ఒకే సామాజికవర్గం గనుక వీహెచ్ తరఫు నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావనే వాదన ఉంది.
ఖమ్మం కాంగ్రెస్ సీటుకు పొదిల పేరు?
- Advertisement -
- Advertisement -