హైదరాబాద్, అక్టోబరు 18, (వాయిస్ టుడే): ప్రవళిక ఆత్మహత్య ఘటనలో పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. అయితే విద్యార్థులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న రాజకీయ నేతలు, విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రవళిక చనిపోవడానికి కారణం గ్రూప్ టు పోస్ట్పోన్డ్ కారణమంటూ రాజకీయ నాయకులు ఆందోళన చేసిన మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై ఐపిసి సెక్షన్స్ 143, 148, 341, 332 R/W 149 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదు చేసిన్లు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వారని అభియోగాలపైన కేసులు నమోదైనట్లు తెలిపారు.ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈ నెల 13వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియుడి మోసం వల్లే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడిందని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు నిర్ధారించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివరాం తనను మోసం చేశాడని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కు వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.