- Advertisement -
కడప నుంచే ప్రక్షాళన….
Purification from Kadapa....
కడప, డిసెంబర్ 27, (వాయిస్ టుడే)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు కడపజిల్లాయే పెద్ద సమస్యగా మారింది. తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే ఆయన ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 నుంచి 2024 వరకూ చంద్రబాబును ఇబ్బందిపెట్టినట్లుగానే,నాడు కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లే ఇప్పుడు పులివెందులతో పాటు కడపజిల్లాను కూడా చంద్రబాబు అండ్ టీం టార్గెట్ చేసింది. అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచిపులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతూ వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత జిల్లాలో తనకు గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ రాకుండా ప్రయత్నాలను ప్రారంభించారు.. వచ్చే నెల మూడో వారం నుంచి జగన్ జిల్లాల పర్యటన చేస్తానని చెప్పారు. అయితే మిగిలిన జిల్లాల్లో నేతలు, క్యాడర్ కొంత బాగానే ఉన్నప్పటికీ కడప జిల్లాలోనే పార్టీ బలహీనమయిందంటున్నారు. కడప జిల్లాలో పార్టీ నేతలు కూడా పెద్దగా వైసీపీకి ఉపయోగపడకుండా మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు. 2019 నియోజకవర్గాల్లో పదికి పది నియోజకవర్గాల్లో గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దూరంగా ఉంటున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి సొంత మేనమామ అయిన కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాధ్ రెడ్డి కూడా గాయబ్ అయ్యారు.ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు. దీంతో కడప జిల్లాపైనే జగన్ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జమ్మలమడక నియోజకవర్గంలోనూ సుధీర్ రెడ్డి అక్కడ క్యాడర్ కు అందుబాటులో లేకుండాపోయారు. తన ఓటమిని జీర్ణించుకోలేక ఆయన గత ఏడు నెలల నుంచి పత్తా లేకుండా పోయారు. అక్కడ క్యాడర్ ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యనేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన ఐదేళ్లకాలంలో మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తిలోనే ఇంకా ఉన్నట్లుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అప్పుడప్పుడు అలా కనిపించి మ.. మ అనిపించి వెళ్లిపోతున్నారు. జగన్ తో తొలి నుంచి అడుగులు వేసినఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ లేదని భావించి శ్రీకాంత్ రెడ్డి మౌనంగా ఉన్నట్లే కనిపిస్తుంది. మైదుకూరు నియోజకవర్గంలో రఘురామిరెడ్డి వయసు రీత్యా కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడూ తాను ఉన్నానంటూ మీడియా సమావేశాలతో సరిపెడుతున్నారు. ఇలా దాదాపు అన్నినియోజకవర్గాల్లోనూ నేతలు పెద్దగా కనిపించడం లేదు. అందుకే వైసీపీ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగారంట. ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లకు ఉన్న సమస్యలేంటి అనే దిశగా జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే నడుస్తుంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటే.. తర్వాత జగన్ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మేయరు సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వర్గీయులే కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య సఖ్యత లోపం ఉంది.వైసీపీ నేతల విభేదాలను టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోటీడీపీ గూటికి సుమారు 20 మంది కార్పొరేటర్లు వెళుతున్నారన్న ప్రచారం జరిగింది. వారితో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్వయంగా రెండు సార్లు సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనతో మీ వెంటే ఉంటామని చెప్పినప్పటికీ .. ఒకేసారి ఏడుగురు కార్పొరేటర్లు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. అంతకు ముందే మరో కార్పొరేటర్ సిటీ కేబుల్ సూర్యనారాయణ సైకిలెక్కారు. మరో 12 మంది టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.మేయరు సురేశ్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాల వైఖరితోనే కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డే వారిద్దరిని దెబ్బ కొట్టడానికి వాంటెడ్‌గా కార్పొరేటర్లను టీడీపీలో పంపిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సొంత జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లి మేయర్ పదవి చేజారితే అది స్టేట్ ఇష్యూ అయి వైసీపీకి మరింత డ్యామేజ్ అవుతుందని జగన్ ఆందోళన చెందుతున్నారంట. అందుకే దాన్ని చక్కబెట్టాల్సిందిగా అవినాష్ కు బాధ్యతలు అప్పజెప్పారంటారు.అయితే పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కారణంగా మరోసారి కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాలేకపోయారట. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకల కోసం జిల్లాకు వచ్చిన జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి, మేయరు సురేశ్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలతో కలిసి 36 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లతో ఇడుపులపాయలో సమావేశమయ్యారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను నేరుగా బుజ్జగించే ప్రయత్నం చేశారంటమీరు పార్టీ మారొద్దు.. మిమ్మల్ని బాగా చూసుకుంటాను.. నేను కూడా 16 నెలలు జైలులో ఉన్నా ను.. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి.. కేసులు పెడతారు. బెదిరింపులకు దిగుతారు… రాబోవు రోజుల్లో మరింత సీరియస్ గా ఉంటుంది… మీరు పార్టీలో ఉండండి.. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందర్నీ బాగా చూసుకుంటానని కార్పొరేటర్లతో చెప్పారంట. 2019లో అధికారంలోకి వస్తే బిర్యాని తినిపిస్తామని చెప్పారు కదా సార్… కనీసం దాని వాసన కూడా మమ్మల్ని చూడనీయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు …అంటూ కొందరు కార్పొరేటర్లు జగన్ ముందే ఆవేదన వ్యక్తం చేశారంట.రాష్ట్ర పర్యటనకు ముందు కడప జిల్లాలో పార్టీని వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సి ఉంది. లేకపోతే వచ్చేఎన్నికలలో అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే కడప జిల్లా నేతలతో వరసగా సమావేశం అవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లాలో కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినపడుతుంది.
- Advertisement -