కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీటి శుద్ధి
ఏడుగురు అరెస్టు
సిద్దిపేట
Purification ritual with turmeric water at KCR’s farmhouse
Seven arrested
ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన అంశంపై పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. అందులో వరదరాజపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రవీణ్ సైతం ఉన్నారు. పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం పట్ల దళిత సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ఏసీపీతో పాటు మర్కూక్ పోలీస్ స్టేషన్‌లోనూ 5 ఫిర్యాదులు చేశారు. దీనిపై ముమ్మర విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో సవాలుగా తీసుకున్న పోలీసులు, సోమవారం ఏడుగురిని అరెస్టు చేశారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా…
వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఓ లాడ్జిలో ఉండగా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి ఆచూకీని సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా కనిపెట్టినట్లు సమాచారం. లాడ్జిలో ఏడుగురు వ్యక్తులు ఉండగా, వారిలో ఒకరు తన మొబైల్ ఫోన్ ఆన్ చేయడంతోనే పోలీసులు వీరు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ వీరిని అదుపులోకి తీసుకొని గజ్వేల్ కు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితులను అక్కడి నుంచి సిద్దిపేట జైలుకు తరలించారు. ఈ..ఘటనలో మొత్తం 9 మందికి పైగా కేసు నమోదు కాగా, వరదరాజ్‌పూర్ మాజీ సర్పంచ్ ప్రవీణ్, భాను, మల్లేశం, ఐలయ్య, ఆర్కల రాజు, అమరేందర్, కొడారి రాజులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు బాలముని, కనకయ్యలు దొరకాల్సి ఉంది.




