నవ్వులు పంచిన పురుష్…
హైదరాబాద్, మే 22, ( వాయిస్ టుడే)
Purush, who spread laughter…
భార్యాల చేతిలో నలిగిపోతూ, వాళ్లు పెట్టే టార్చర్ అనుభవిస్తూ భార్యా బాధితులుగా ఉన్న పాత్రలతో కథలు అల్లుతూ, పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన సినిమాలు దాదాపుగా తెలుగులో విజయాలు సాధించాయి. ఇలాంటి కథాంశాలకు వినోదాన్ని జోడించి ఎంటర్‌టైన్ చేయగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆడాళ్ల అహంకారం, ఆడాళ్ల చేతిలో బలైపోయి, అనుమానాలు పడిన మగాళ్ల కథలు, వెతలతో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరేళితే, ఎఫ్-2 లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు.
గోవింద్ (పవన్ కల్యాణ్), త్రిమూర్తులు (సప్తగిరి), శీను (కసిరెడ్డి), కిస్ (వెన్నెల కిషోర్) చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో కలిసి పెరిగిన స్నేహితులు. వీరిలో కిస్‌కు తప్ప అందరికి పెళ్లి జరుగుతుంది. అయితే భార్యల చేతిలో నలిగిపోతున్న బాధితులుగా ముగ్గురు బాధపడుతుంటారు. వీళ్లంటే భార్యలకు అసలు లెక్కలేదు. నిత్యం గొడవలే. ఇక అనుకోకుండా కిస్ పెళ్లికి ముగ్గురు స్నేహితులు కుటుంబంతో కలిసి వెళతారు. అయితే అక్కడే తమ భర్తల గురించి కొన్ని వాస్తవాలు భార్యలకు తెలుస్తాయి. భర్తల నిజ స్వరూపం తెలుసుకున్న భార్యలు ఏం చేశారు? వాళ్లు చేసిన పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది? భార్యలు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న తరువాత జరిగిందేమిటి? కిస్ వల్ల తెలిసిన నిజాలు ఏమిటి? వాటి వల్ల ఈ ముగ్గురి స్నేహితుల కాపురాల్లో జరిగిందేమిటి? అనేది మిగతా కథ. ప్రస్తుతం సమాజంలో భార్యా భాదితులు ఎక్కువగా ఉన్నారనే తలంపుతో దర్శకుడు రాసుకున్న కథ ఇది. అలాంటి వాళ్లు అందరూ ఈజీగా అందరూ కనెక్ట్ అయిపోతారని ఈ కథకు కాస్త వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టులు అంటూ ఈ కామెడీ కథను కాస్త సీరియస్‌గా మొదలుపెట్టారు. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించిన ఫస్టాఫ్‌లో కిస్‌గా వెన్నెల కిషోర్ పాత్ర ఎంట్రీతో కథ కాస్త ఊపందుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ శోభనం ఏపిసోడ్, ఆ సమయంలో ముగ్గురు స్నేహితుల చిన్నప్పటి రాసలీలలు డైరీలో భార్యలు చదివే సన్నివేశాలు ఆడియన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఈ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్‌లో సీన్స్ అన్నీ సాగదీతలా బోరింగ్‌గా అనిపించాయి. ఇలాంటి కథతో చేసే సినిమాకు హిలేరియస్ కామెడీ ఉంటేనే వర్కవుట్ అవుతుంది. అక్కడక్కడ నవ్విస్తూ, ఎక్కువగా విసిగిస్తూ ఉంటే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కష్టమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటే ఇంతకు ముందు వచ్చిన ఈ తరహా సినిమాల్లోని సన్నివేశాలను కాపీ చేసినట్లుగా అనిపించాయి. కొత్త తరహా సన్నివేశాలకు ఏ మాత్రం ప్రయత్నించలేదు. ముఖ్యంగా ముగ్గురు స్నేహితులు జడ్జ్ (వీటీవీ గణేష్)కి తమ కథను చెప్పుకునే సీన్స్ లెంగ్తీగా, స్లో అనిపిస్తాయి. స్లోగా, నీరసంగా కదులుతున్న ఈ సినిమాలో వేగం పెంచింది మాత్రం వెన్నెల కిషోర్ పాత్రే. ఆయన తన టైమింగ్‌తో, డైలాగ్స్‌తో అలరించాడు. సెకండాఫ్‌లో ఫ్రెంచ్ అమ్మాయి, హీరోకి వచ్చే ప్రేమ సన్నివేశాలు రక్తికట్టలేదు. అక్కడక్కడ నవ్వించిన ఈ సినిమాలో ఎమోషన్స్ పండించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కథగా ఫర్వాలేదనిపించినా, రైటింగ్ పరంగా పెద్దగా శ్రద్ద పెట్టలేదు. కామెడీ డోస్ సరిపోలేదు. అందుకే ‘పురుషః’ పూర్తిస్థాయిలో అలరించలేదు. ఈ చిత్రంలో హీరోగా నటించిన పవన్‌కల్యాణ్ నటన పరంగా పర్వాలేదనిపించాడు. అయితే నటనలో మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. వెన్నెల కిషోర్ తనదైన శైలిలో వన్‌మ్యాన్ షో చేశాడు. సప్తగిరి కామెడీ కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఈ సినిమాలో కసిరెడ్డి పోషించిన పాత్రను చూస్తుంటే కంటిన్యూగా ఒకే తరహా పాత్రలు చేస్తున్నాడా? అనే సందేహం కలుగుతుంది. ఆయన పాత్రలు రొటిన్ అయిపోతున్నాయి. వీటీవీ గణేష్ డైలాగ్ డెలివరి, బాడీ లాంగ్వేజ్ సీన్స్ వల్ల సన్నివేశాలు మరింత స్లోగా అపిపించాయి. హీరోయిన్‌లుగా నటించిన ముగ్గురు విషిక, రాయంచ, హాసిని సుధీర్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు ఆకట్టుకోలేదు.నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో లేదు.
నిర్మాణ విలువలు పర్వాలేదు. కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టారు. ఓవరాల్‌గా పురుషః పూర్తిస్తాయిలో అలరించకపోయినా..అక్కడక్కడా మాత్రం నవ్వులు పంచింది.



