తుక్కుగూడ వేదికగా రేపు జరగనున్న జన జాతర సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ వేదికగానే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగంణం మొత్తం కలియ తిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు.
తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. ఆ సభ నుంచే హస్తం పార్టీ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు క్లారిటీనిచ్చింది. జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర జాతీయస్థాయి నేతలు హాజరుకానున్నారు. దీంతో సభకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ్‌లు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.