ధాన్యం కొనుగోలు రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలి…
Records of purchase of grain should be kept under control.అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనాలి
19 వేల రైతుల నుంచి 1,19,952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సన్న రకం పండించిన 12 వేల 441 మంది రైతులకు బోనస్ క్రింద 38 కోట్ల 84 లక్షలు జమ
కొనిజర్లలోని ఐ.కె.పి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఖమ్మం
డిసెంబర్ 10
ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కొణిజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర వివరాలను అదనపు కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 19 వేల మంది రైతుల నుంచి లక్షా 19 వేల 952 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, లక్షా 18 వేల 220 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించామని అన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొరకు గోడౌన్ స్థలం అందుబాటులో ఉందని అన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర క్రింద మొత్తం 278 కోట్ల 29 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి 181 కోట్లు 83 లక్షలు చెల్లించడం జరిగిందని అన్నారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.
సన్న రకం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, ఖమ్మం జిల్లాలో సన్న రకం వడ్లు పండించిన 12 వేల 441 మంది రైతులకు బోనస్ క్రింద ఇప్పటి వరకు 38 కోట్ల 84 లక్షలు జమ చేశామని అదనపు కలెక్టర్ అన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి వివరాలు రికార్డులో నమోదు చేస్తూ పకడ్బందీగా నిర్వహణ చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర, సన్న రకం ధాన్యానికి బోనస్ డబ్బులు రైతులకు సకాలంలో జమ అయ్యేలా చూడాలని అన్నారు.
ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




