Sunday, September 8, 2024

రెన్యువల్‌ చేస్తేనే.. కొత్త రుణాలు

- Advertisement -

‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తాం. రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి’ ఇదీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ.

రేవంత్‌రెడ్డి ఆశించినవిధంగా డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ, డిసెంబర్‌ 9న రైతుల రుణం మాత్రం మాఫీ కాలేదు. డిసెంబర్‌ 9 దాటిపోయి నాలుగు నెలలవుతున్నది. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన నిర్దిష్ట చర్యలేవీ తీసుకోకపోవడంతో బాకీలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. కాంగ్రెస్‌ హామీలు నమ్మి ఓట్లు వేసిన రైతులు మాత్రం బ్యాంకుల్లో అప్పు దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరో రెండు నెలల్లో వానకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మెలిక పెడుతున్నాయి. పాత రుణాలు చెల్లిస్తే లేదా రెన్యువల్‌ చేస్తేనే కొత్త రుణాలు ఇస్తామని షరతు పెడుతున్నాయి. అప్పటివరకు కొత్త రుణాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నాయి. దీంతో ఈ వానకాలం సీజన్‌కు పంట రుణాలు లభించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో ఇవ్వలేమని ఒక బ్యాంకు అధికారి చెప్పడం గమనార్హం. ఇప్పటికే 2024-25 సంవత్సరానికి బ్యాంకులతో కలిసి నాబార్డ్‌ రుణప్రణాళికను విడుదల చేసింది. ఇందులో పంట రుణాలకు రూ.81,478 కోట్లు, టర్మ్‌లోన్స్‌కు రూ.27,664 కోట్లు కేటాయించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రుణమాఫీని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. రుణమాఫీ చేస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నా, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ లోపించిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో ఒకటి రెండు సమావేశాలు జరిగాయి. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, రైతుల రుణాలను ఆ కార్పొరేషన్‌కు బదిలీ చేయించుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకు బ్యాంకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఆ కార్పొరేషన్‌కు ఆదాయ వనరులను చూపించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ఈ ప్రతిపాదన పట్టాలెక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. రుణమాఫీలో అత్యంత ప్రధానమైన కటాఫ్‌ తేదీని సైతం ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయించలేదు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రుణాలు తీసుకున్నవారికి రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలనే అంశంపై స్పష్టత లేదు. దీంతో రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో అర్థంకాని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో రుణమాఫీ ఎప్పటికి పూర్తవుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండుసార్లు రైతుల రుణాలను రూ.లక్ష చొప్పున మాఫీ చేసింది. 2014లో 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఈ విధంగా మొత్తంగా కేసీఆర్‌ సర్కారు సుమారు రూ.30 వేల కోట్ల వరకు రైతుల రుణాలను మాఫీ చేసింది.

రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్న ప్రస్తుత తరుణంలో తక్షణమే రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తే ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. దీంతో వానకాలం సీజన్‌కు కొత్త రుణాలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి తప్పుతుందని ఆశ పడుతున్నారు. ఒకవేళ రుణమాఫీ కాకపోతే కొత్త రుణం పుట్టడం కష్టమేనని, సాగుకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐదు ఎకరాలు పైబడినవారికి ఇంకా రైతుబంధు సొమ్ములు అందకపోవడం, యాసంగి సీజన్‌ దెబ్బతీయడంతో పాత రుణాలకు వడ్డీలు చెల్లించి, రెన్యువల్‌ చేయించుకొనే స్థోమత కూడా లేకుండాపోయిందని పెద్ద రైతులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ రుణం మొత్తం చెల్లించినా, రెన్యువల్‌ చేసినా తమకు రుణమాఫీ వర్తింపచేయరేమోనన్న భయం కూడా రైతులను వెన్నాడుతున్నది. దీంతో రెన్యువల్‌ చేయించుకోవడానికి రైతులు ఆసక్తిచూపడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన బ్యాంకులు కఠినవైఖరి అవలంభిస్తున్నాయి. ‘రేవంత్‌రెడ్డి హామీతో, ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. రుణాలను చెల్లించాల్సిందే’ అని బ్యాంక్‌ అధికారులు రైతులకు కరాఖండిగా చెప్తున్నారు. పలు చోట్ల రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేస్తుంటే, మరికొన్ని చోట్ల బ్యాంకు అధికారులు రైతులను వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్‌ జిల్లా కొత్వాల్‌పల్లి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు గ్రామంలోకి వెళ్లి పలువురు రైతులను అందరి ముందు అవమానించారు. ఈ ఘటనను ఏ ఒక్క మంత్రి కూడా ఖండించకపోవడంపై విమర్శలొచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వమే బ్యాంకులను రైతులపై ఎగదోస్తున్నదా? అనే అనుమానాలను రైతులు వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్