నిర్వాసితులు ఇంటి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి…
Residents should start house construction immediately...రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
నగరంలోనే అత్యంత విలువైన ప్రాంతంగా రఘునాథపాలెం మండలం అభివృద్ధి
రైల్వే మూడవ లైన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన వారికి రఘునాథ పాలెం మండలం వెంకటాయపాలెంలో ఇళ్ల పట్టాలను అందించిన మంత్రి తుమ్మల
ఖమ్మం
రైల్వే మూడవ లైన్ క్రింద ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు, వారికి కేటాయించిన ఇండ్ల స్థలాలలో ఇంటి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, వారికి అవసరమైన అన్ని రకాల మౌళిక వసతులు కల్పించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
రైల్వే మూడవ లైన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన వారికి రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో ఇళ్ల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వే 3వ లైన్ క్రింద పూర్తిగా ఇండ్లను కోల్పోయిన 58 మందికి వెంకటాయపాలెంలో 75 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, వీరికి పట్టాలతో పాటు ఇంటి విలువ పరిహారం కూడా అందించామని అన్నారు.
నిర్వాసితులు ప్రభుత్వం అందించిన ఇంటి పట్టాలతో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, వీరికి అవసరమైన త్రాగు నీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్తు మొదలగు మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అమరావతి వెళ్ళే జాతీయ రోడ్డు, సర్వీస్ రోడ్డు ఈ ప్రాంతంలో వస్తాయని, ఇక్కడ భూములకు మంచి ధరలు పెరుగుతాయని అన్నారు.
యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలు సమీపంలోనే నిర్మాణం అవుతున్నాయని, మీ పిల్లలు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందించిన పరిహారం సద్వినియోగం చేసుకుంటూ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఇక్కడ సమీపంలోనే కలెక్టరేట్ ఉన్నదని, వైద్య కళాశాల, ఆసుపత్రి వస్తాయని, ఈ ప్రాంతం చాలా విలువ కలిగిన ప్రాంతం అవుతుందని అన్నారు.
ఖమ్మం నగరంలోని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత, రోడ్డు వెడల్పు వంటి కార్యక్రమాల్లో ఇళ్లను కోల్పోయే వారికి సైతం నగరం చుట్టూ మంచి స్థలాల్లో చూసి ఇంటి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, మునిసిపల్ కార్పొరేటర్లు తోట రాములు, కమర్తపు మురళీ, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




