
హైదారాబాద్: పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి తన బాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. శనివారం తెలంగాణ భవన్ లో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్ధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్ధి, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే లు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నాంపల్లి, కంటోన్మెంట్, గోషా మహల్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆనంద్ గౌడ్, లాస్య నందిత, నంద కిషోర్ వ్యాస్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గబీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల లో జరుగుతున్న ప్రచార సరళి, ఈ నెల 17 నుండి జరిగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో, 25 వ తేదీన జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పై చర్చించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటికి అడ్డు అదుపూ లేని ఒక మూర్ఖుడిని పిసిసి అద్యక్షుడిగా నియమించిందని విమర్శించారు. ఉన్నత పదవులలో ఉన్న వారిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిచక పోవడం విచారకరం అన్నారు. తాము అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు. ప్రజలు కూడా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మీ విధానాల పై ప్రజలకు వివరించాలే కానీ పరుష పదజాలం ఉపయోగించడంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు తమను తాము అతిగా ఊహించుకుంటున్నారని, తమ తమ నియోజకవర్గాలలో ఓడిపోతామని తెలిసి తమ పార్టీ అధిష్టానాల మెప్పు కోసం ముఖ్యమంత్రి పై పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒడి పోతాననే భయంతోనే రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలో పోటీకి దూరం గా ఉన్నారని విమర్శించారు. రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.