తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్,
రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, మార్చి 29, (వాయిస్ టుడే )
Revanth's focus is on Telangana Bhavan,
తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని, హోం మంత్రి కూడా ముఖ్యమంత్రే అని బీఆర్ఎస్ నేత ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ అన్నారు. రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు, ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ద్వంసం చేస్తున్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం హరిస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అసెంబ్లీ లోపలా బయటా గణాంకాలతో సహా రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ ఎండగట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారు. మార్చి 15 ,16 తేదీల్లో పదిహేను కేసులు పెట్టారు. ఆఖరికి రీ ట్వీట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. ఐటీ యాక్ట్ కు వ్యతిరేకంగా కేసులు నమోదు అవుతున్నాయి. 2023 లో కేసీఆర్ హయంలో తెలంగాణ సైబర్ సెక్క్యూరిటీ బ్యూరో ఏర్పడింది. సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను కాపాడాలన్న మంచి ఉద్దేశంతో ఆ బ్యూరో పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి హోం మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను దుర్వినియోగం చేస్తున్నారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరో ను కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారు. కొందరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే ఫోకస్ చేశారు. గాంధీ భవన్, బీజేపీ ఆఫీసులు సైబర్ పెట్రోలింగ్ లో లేవు. రేవంత్ సైన్యం పేరిట కేటీఆర్ పై దారుణమైన పోస్టులు పెడితే చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్ని దారుణమైన పోస్టులు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? గౌతమ్ ,దిలీప్ కొణతం, క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. కానీ తెలంగాణ సీఎం రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధితుడు, ఇన్వెస్టిగేటర్, జడ్జి అన్ని పాత్రలు సీఎం రేవంత్ రెడ్డి పోషిస్తున్నారు జైల్లో తనను ఘోరంగా చూశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ ఛానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్వయంగా రేవంత్ చెప్పారు. నాగయ్య అనే తోటి ఖైదీ తనకు అన్ని చేసిపెట్టారని చెప్పారు. నాగయ్యను వాడు వీడు.. కింద కూర్చునే వాడంటూ రేవంత్ ఫ్యూడల్ మైండ్ సెట్ ను చాటుకున్నారు
రేవంత్ సోదరులు చెబితేనే..
సైబర్ పెట్రోలింగ్ జరగాల్సింది సెక్రటేరియట్ లో కానీ రేవంత్ సోదరులు చెబితే కానీ సచివాలయంలో ఫైళ్లు కదలడం లేదు. అక్కడ సైబర్ పెట్రోలింగ్ జరగాలి. ఆర్ ఆర్ టాక్స్ యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. దిలీప్ కొణతం, జర్నలిస్టు రేవతిపై వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. వారు ఏం తప్పు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రం లో నేరాలు చేస్తున్నాయి. వాటి మీద కేసులు పెట్టండి. మేం ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. పోలీసు అధికారులు రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. మేం అధికారంలోకి వచ్చాక నిజాయతీ గల అధికారులను గుర్తించి ప్రోత్సహిస్తాం. మాకు ఏ ఫేవర్ అవసరం లేదు. హరీష్ రావు ను పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేతపై పోలీసులు కేసు పెట్టలేదు. గాంధీ భవన్ లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తే.. యధాతథంగా ఎఫ్ఐఆర్ లుగా కేసులు నమోదు చేస్తున్నారు.కొడంగల్ కు చెందిన ఓ అధికారిని గొర్రెల స్కాంలో 52 రోజులు ఆకారణంగా జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికైనా భాద్యతగా పని చేయాలి. తప్పు చేస్తున్న పొలీసులకు వారి కుటుంబ సభ్యులు కౌన్సెలింగ్ చేయాలని’ సూచించారు.