మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్
హైదరాబాద్, ఏప్రిల్ 8, (వాయిస్ టుడే )
RTC strike siren from May 6
తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. మే 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో తెలిపారు. కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు.సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి. 2023 జనవరి 27న తొలిసారి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి సమ్మె నోటీసులు ఇచ్చాయి కార్మిక సంఘాలు. జేఏసీగా ఏర్పడిన కార్మిక సంఘాలన్నీ 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చాయి.మరో నెల రోజుల్లో తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంపై గత రెండు మూడు నెలలుగా కార్మిక సంఘాలు కోరుతున్నా.. ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సానుకూల స్పందన రాకపోవడంతో వచ్చే నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని జేఏసీ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు ఇచ్చారు.21 డిమాండ్లలో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభించలేదు. టీజీఎస్ఆర్టీసీలో దాదాపు 16 వేల మంది కార్మికులు రిటైర్ అయినప్పటికీ కొత్త నియామకాలు చేపట్టలేదని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పని భారమంతా ప్రస్తుతం ఉన్న కార్మికులపైనే పడుతున్నదని ఈయూ, టీఎంయూ నాయకులు తెలిపారు. దీంతో రోజుకు 14 నుంచి 16 గంటలపాటు పనిచేయాల్సి వస్తుందన్నారు. అధిక పనిభారాన్ని తట్టుకోలేక కార్మికులు ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. 2017 వేతన సవరణకు సంబంధించిన అలవెన్సులను ఇప్పటి వరకు పెంచలేదని, వాటిని ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు.మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.వేతన సవరణ జరిగినా అరియర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బకాయిలు అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులపై పని భారం పెరిగిపోయిందన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.