హైటెక్స్‌లో అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌–2026’

- Advertisement -

హైదరాబాద్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

అక్టోబర్ 14, 15 తేదీల్లో హైటెక్స్‌లో అంతర్జాతీయ వ్యాపార సదస్సు
 SCCను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

‘Samakhya Global Business Meet–2026’
‘Samakhya Global Business Meet–2026’

వ్యాపార రంగానికి గ్లోబల్ బూస్ట్‌.. సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026

ప్రత్యేక ఆకర్షణగా పద్మవిభూషణ్‌ చిరంజీవి.. పాల్గొననున్న కేంద్ర మంత్రి కమలేష్‌ పాస్వాన్‌

4,500 మందికి పైగా వ్యాపారవేత్తలు, 110కి పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యం

హైదరాబాద్, అక్టోబర్ 10: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాల విస్తరణ లక్ష్యంగా సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SCC) ఆధ్వర్యంలో అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ నిర్వహించనున్నారు. ఈ వివరాలను శనివారం లక్డీకాపూల్‌లోని హాంప్‌షైర్ ప్లాజా హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు.

అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SCCను ప్రారంభించనుండగా, సాయంత్రం 5 గంటలకు పద్మవిభూషణ్ చిరంజీవి హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ‘పెట్టుబడి అవకాశాల తెలంగాణ’ అంశంపై జరిగే వ్యాపార సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు.

4,500 మందికి పైగా వ్యాపారవేత్తలు

నిర్వాహకుల అంచనా ప్రకారం ఈ సదస్సుకు 4,500 మందికి పైగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానుండగా, 110కి పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 40 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ వక్తలు, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందాలు పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.

రక్షణ రంగం, సెమీకండక్టర్లు, ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ, బ్యాంకింగ్, ఎంఎస్ఎంఈ ఫైనాన్స్, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ, ఐపీఓలు, పన్నులు, జీఎస్టీ, విదేశీ వాణిజ్యం, కృత్రిమ మేధ వంటి అంశాలపై చర్చలు, ప్యానెల్ సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వడంతో పాటు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయి.

ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ప్రత్యేక వేదిక

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యమిస్తూ వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడులు, కొత్త మార్కెట్ల అన్వేషణకు ఈ సదస్సు వేదిక కానుంది. ఎస్‌బీఐ–ఎంఎస్ఎంఈ, సిడ్బీ, బీఎస్‌ఈ–ఎస్ఎంఈ, బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, ఆర్థిక సలహా సంస్థల ప్రతినిధులు పాల్గొని సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ పటిదార్ బిజినెస్ ఆర్గనైజేషన్, డీఐసీసీఐ వంటి సంస్థల ప్రతినిధుల భాగస్వామ్యంతో పాటు దీర్ఘకాలిక సహకారానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.

మూడు సంస్థల సమష్టి చొరవ

విశ్వ సమాఖ్య, పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్‌వర్క్ (PEN), ఆల్ ఇండియా తెలగ బలిజ కాపు సంఘం (AITBKS) కలిసి సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఎంఎస్ఎంఈలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరంతర సంస్థాగత సహకారం అందించడం, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతో అనుసంధానించడం, శిక్షణ, మెంటర్‌షిప్, మార్కెట్ సమాచారం, విదేశీ వాణిజ్య అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం SCC ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు వివరించారు.

ఈ లక్ష్యాల్లో భాగంగా స్టార్టప్ లెర్నింగ్ సెల్, మహిళా పారిశ్రామికవేత్తల సహాయ విభాగం, బిజినెస్ మెంటర్‌షిప్, వెంచర్ క్యాపిటల్–ఏంజెల్ ఫండింగ్, విదేశీ వాణిజ్య ప్రోత్సాహం వంటి విభాగాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అసోసియేట్ సభ్యత్వానికి ఒకేసారి రూ.10,000 రుసుము నిర్ణయించగా, చేరిక సమయంలో మహిళా పారిశ్రామికవేత్తలు, 30 ఏళ్లలోపు పారిశ్రామికవేత్తలకు అదనంగా ఒక కాంప్లిమెంటరీ సభ్యత్వం కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

కేంద్ర మంత్రులతో SCC ప్రతినిధుల భేటీ

సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అక్టోబర్ 5, 6 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులను కలిశారు. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ సహకారంతో ఆర్థిక, ఎంఎస్ఎంఈ, కార్మిక, వ్యవసాయ, జలశక్తి, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల మంత్రులు, సహాయ మంత్రులకు SCC కార్యకలాపాలను వివరించి వ్యాపారవేత్తలకు సహకారం అందించాలని కోరినట్లు సంస్థ తెలిపింది.

ఎస్‌బీఐ, సిడ్బీ రుణ పథకాలు, ఎంఎస్ఎంఈ ఆర్థిక సహాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, గిడ్డంగులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే సంబంధిత వ్యాపారాలు, గ్రామీణాభివృద్ధి పథకాలపై మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలను పెట్టుబడులతో, పరిశ్రమలను నూతన ఆవిష్కరణలతో, వ్యాపారవేత్తలను అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానించే వేదికగా ఈ సదస్సును తీర్చిదిద్దాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular