అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ
హైదరాబాద్‌లో ఐటీసీ కాకతీయ హోటల్‌లో సమావేశం.. సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Megastar Chiranjeevi and Ram Charan meet Amit Shah
హైదరాబాద్, నవంబర్ 2: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా వారిని సాదరంగా ఆహ్వానించారు.
భారతీయ సినిమాను, తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో చిరంజీవి, రామ్‌చరణ్ చేస్తున్న కృషిని అమిత్ షా అభినందించారు. ఈ భేటీ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతికత దుర్వినియోగంతో కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.
అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీజేపీ నిర్వహించిన మహాపాదయాత్రకు ముందు ఈ భేటీ జరగడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే సమావేశంలో రాజకీయ అంశాలు చర్చించారా అనే దానిపై అధికారిక వివరాలు వెల్లడికాలేదు.




