Sunday, December 22, 2024

అన్నా, చెల్లి మధ్య సరస్వతి పవర్స్…అసలేం జరిగింది…

- Advertisement -

అన్నా, చెల్లి మధ్య సరస్వతి పవర్స్…అసలేం జరిగింది…

Saraswati Powers between brothe and sister...what happened...

హైదరాబాద్, అక్టోబరు 4, (వాయిస్ టుడే)
ఏపీలో పొలిటికల్‌ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్‌ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు చెల్లెలు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్‌ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్‌. సరస్వతీ పవర్‌ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తికూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయింది. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే, తన చెల్లెలపై ప్రేమకొద్దీ రాసిన MOUలో సరస్వతీ సిమెంట్స్‌లో 49శాతం షేర్లు ఇస్తానని జగన్‌ చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చట్టవిరుద్ధం కాబట్టి, నమ్మకంకోసం అప్పటికే 1శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఇస్తానన్న ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. కేసులు తేలాక షర్మిల పేరుమీద బదిలీ చేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను 2019లోనే రాసిచ్చారు. అయితే కోర్టు కేసుల్లో, అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తిని నిర్వహించుకోవడానికే తప్ప ఏరకంగానూ క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీల్లేదు. 2021లో సరస్వతీ పవర్‌లో జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరనుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు షర్మిల. కోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం లీగల్‌గా ఇబ్బంది తెచ్చిపెడుతుందని జగన్‌ను న్యాయవాదులు హెచ్చరించారు. దీంతో న్యాయవాదుల సూచనలతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్‌ లీగల్‌గా NCLTని ఆశ్రయించారు.తాజా నోటీసుల నేపథ్యంలో కుటుంబ ఆస్తుల వ్యవహారంలో అన్నాచెల్లెళ్ల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలు తెర మీదకు వచ్చాయి. వైఎస్సార్‌ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆస్తులు కూడా బదిలీ చేయడానికి జగన్‌ సిద్దపడ్డారు. అయితే సరిగ్గా ఈ సమయంలో వైయస్సార్‌ మరణం తర్వాత సీబీఐ, ఈడీ కేసులతో వైయస్‌.జగన్‌ కు చెందిన ఆస్తులు, కంపెనీలన్నీ కూడా అటాచ్‌మెంట్లోకి వెళ్లిపోయాయి. అటాచ్‌మెంట్‌ కిందున్న ఆస్తులు బదిలీచేయడం కాని, విక్రయించడంకాని చట్ట విరుద్ధం.దీన్ని దృష్టిలో ఉంచుకుని, తన చెల్లెలితో ఉన్న అనుబంధం దృష్ట్యా, ప్రేమకొద్దీ తాను సొంతంగా సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 2019 ఆగస్టు 31న షర్మిలకు అగ్రిమెంట్‌ రాసిచ్చారు. కేసుల్లో ఆస్తులు ఉన్నందున వాటిని నేరుగా బదిలీ చేయడానికి చట్టపరంగా ఆస్కారం లేనందున తన చెల్లెలకు నమ్మకం కలిగించేందుకు అవగాహనా ఒప్పందాన్ని రాసిచ్చారు. ఇలా రాసిన మొత్తం పది రకాల ఆస్తుల్లో సరస్వతీ సిమెంట్స్‌ కూడా ఒకటి. కేసులు తేలిన తర్వాత వాటిని అప్పగిస్తామని అందులో పేర్కొన్నారు.అయితే మొత్తం ఆస్తుల బదిలీ ప్రక్రియ కోర్టు తీర్పులకు లోబడి ఉంటాయని రాసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరపకూడదు. కానీ షర్మిల సరస్వతి పవర్‌లో తన తల్లి విజయలక్ష్మి పేరుతో ఉన్న గిఫ్ట్‌ డీడ్‌ షేర్లను తనపేరుతో రాయించుకున్నారు. దీనిపై అభ్యంతరం చెబుతూ షర్మిలకు జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. చట్టవిరుద్దంగా జరిగిన షేర్ల బదిలీ వల్ల న్యాయపరంగా చిక్కులు తప్పవని.. తన బెయిలు కూడా రద్దయ్యే అవకాశం ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.తనకు తెలియకుండా, చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వ్యవహారంపై వైఎస్ జగన్‌ వెంటనే తన తల్లికి, చెల్లెలకు కూడా అభ్యంతరాలు తెలియజేశారు. తాను ప్రేమకొద్దీ నమ్మకంతో ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను వినియోగించుకుని, షేర్ల బదిలీ చేయడం సరికాదని తెలిపారు. ఇది నమ్మకాన్ని వమ్ము చేయడమంటూ స్పష్టం చేశారు. షర్మిల, విజయమ్మ స్పందించకపోవడంతో NCLTని ఆశ్రయించినట్టు చెబుతున్నారు. అదే సమయంలో షర్మిలతో చేసుకున్న MOU రద్దుకు కూడా జగన్ సిద్దపడుతూ లేఖ రాశారు.
నోటీసులతో అలర్ట్‌…
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్‌ ఎక్కువగా బెంగుళూరులోనే ఉండే వారు. ఈ క్రమంలో ఈడీ నుంచి షేర్ల బదిలీ నోటీసులు అందడంతో ఆయన ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. తనను ఇబ్బందులకు గురి చేయడానికే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి షర్మిల కంపెనీ షేర్లను బదిలీ చేసుకున్నట్టు భావించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల్ని బదిల చేస్తే బెయిల్ రద్దు చేయొచ్చనే దురుద్దేశం ఉందని అనుమానించారు. దీంతో ఈ వ్యవహారంపై షర్మిలకు నేరుగా లేఖ రాశారు. తనను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నావంటూ అందులో ఆరోపించారు.ఆగస్టు 27న షర్మిలకు రాసిన లేఖలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేసేలా విమర‌్శలు చేస్తున్న అంశాన్ని అందులో ప్రస్తావించారు. ఆస్తుల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పలు సందర్భాల్లో దాదాపు రూ.200కోట్ల రుపాయల నగదును దశాబ్ద కాలంలో ఆమెకు చెల్లించినట్టు లేఖలో పేర్కొన్నారు. చెల్లెలిపై ప్రేమ, అప్యాయతతో ఆస్తుల పంపకానికి అంగీకరించినట్టు అందులో పేర్కొన్నారు.సోదరికి ఇవ్వాల్సిన ఆస్తుల పంపకంపై 2019లో ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో అంగీకరించినట్టు గుర్తు చేశారు. అయితే మారిన పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఓయూకు కట్టుబడి ఉండలేనని పేర్కొన్నారు. దాంతో పాటు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై 2021లో చేసిన గిఫ్ట్‌ డీడ్‌ కూడా రద్దు అవుతున్నట్టేనని ఆ లేఖలో పేర్కొన్నారు.
జగన్ లేఖపై షర్మిల కూడా ….
2019 నాటి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు జగన్‌ రాసిన లేఖపై షర్మిల కూడా స్పందించారు. తండ్రి బతికున్న సమయంలో ఆయన మనుమలు, మనవరాళ్లు నలుగురికి ఆస్తుల్లో సమాన వాటాలు దక్కాలని నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. తనపై ఉన్న ప్రేమ అప్యాయతతో ఆస్తుల పంపకానికి ఒప్పుకుంటున్నట్టు ఎంఓయూలో పేర్కొనడం అర్థ సత్యమేనని షర్మిల ఆరోపించారు. భారతీ సిమెంట్స్‌, సాక్షి వంటి సంస్థల్లో మెజార్టీ షేర్లు జగన్ చేతిలో ఉన్నాయని, అతని ఆధిపత్యమే కొనసాగుతోందని గుర్తు చేశారు.బలం ఉందనే ఉద్దేశంతో బలవంతంగా ఎంఓయూని నిర్ణయించినట్టు ఆరోపించారు. షేర్లను తల్లిపేరిట బదిలీ చేసిన తర్వాత, గిఫ్ట్ డీడ్‌పై జగన్, బారతీలు సంతకాలు చేసిన తర్వాత వాటిపై వివాదాలు సృష్టించడం సరికాదని ఆరోపించారు. తన రాజకీయ జీవితం తన వ్యక్తిగత నిర్ణయమని షర్మిల ఆ లేఖలో స్పష్టం చేశారు. యలహంకలో ఉన్న 20ఎకరాల ఇంటిపై జగన్ మౌఖికంగా అమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. షర్మిల రాసిన లేఖపై ఆమె తల్లి విజయమ్మ కూడా సంతకం చేశారు.కుటుంబ పెద్దగా అందరికీ ఆస్తులు సమంగా పంచాల్సిన బాధ్యతలో ఉండి నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమంటూ ప్రతి లేఖ రాశారు వైఎస్ షర్మిల. ఆస్తుల పంపకంపై చట్టబద్దంగా చేసుకున్న అగ్రిమెంట్‌ రద్దు చేయాలన్న జగన్‌ ఆలోచన ఆచరణసాధ్యం కాదన్నారు షర్మిల. నిర్ణయం మార్చుకుని వైఎస్‌ఆర్‌ వారసులకు సమంగా ఆస్తులు పంచకపోతే తానే లీగల్‌ ఫైట్‌ చేయడానికి సిద్ధమవుతానంటూ అల్టిమేటం ఇచ్చారు షర్మిల. తన రాజకీయాలకు, ఆస్తుల పంపకాలకు ముడిపెట్టడాన్ని షర్మిల తప్పబట్టారు. కుటుంబ ఆస్తుల విషయంలో జరిగిన చర్చలు, పరిణామాలకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న తల్లి విజయలక్ష్మి కూడా లేఖలో సంతకం చేశారని.. ఇది గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు షర్మిల.అయితే తండ్రి ఉండగా సంపాదించిన ఆస్తుల్లో వాటాలు ఇప్పటికే ఇచ్చామని.. కేవలం ప్రేమాభిమానాలతో తన ఆస్తులు ఇవ్వడానికి జగన్‌ సిద్దపడ్డారని, అయినా తప్పుగా ప్రచారం చేయడం తగదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య లేఖాస్త్రాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆస్తుల పంపకం విషయంలో విబేధాలు ఉన్నాయని ఇంతకాలం ప్రచారం జరిగినా తాజా పరిణాయాలు వాటిని నిజం చేస్తున్నాయి. మరి వైఎస్‌ఎర్‌ కుటుంబంలో తలెత్తిన ఈ సంక్షోభం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్