Saturday, March 28, 2026

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ కు చతుర్ముఖ పోటీ

- Advertisement -

పార్టీకి ఊపు ఉన్న నేపథ్యంలో సీటుకు పోటాపోటీ
మరి.. టికెట్ అనుభవానికా? యువతరానికా?
మాజీ మంత్రి సంభానికి మరోసారి సీటిస్తారా?
ఓయూ కోటాలో మానవతారాయ్ బరిలో నిలుస్తారా?
పెండింగ్ లోని 19 సీట్లలో 5 ఉమ్మడి ఖమ్మంలోనివే
వీటిలో సత్తుపల్లి టికెట్ కు నేతల మధ్య గట్టి పోటీ
40 ఏళ్లుగా పార్టీ పట్ల విధేయతతో సంభాని చంద్రశేఖర్
ఓయూ ఉద్యమ నేతలకు రాహుల్ టికెట్ హామీతో రాయ్
రేసులో బలంగా మట్టా దయానంద్, కొండూరు సుధాకర్

(వాయిస్ టుడే, తల్లాడ): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగానూ ప్రత్యేకంగా నిలిచిన నియోజకవర్గం సత్తుపల్లి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం ఇది. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నాయకులను ఇచ్చిన నియోజకవర్గం కూడా. ఈసారి కూడా ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం ప్రత్యేకంగా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ రేసు రసవత్తరంగా ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని 119 సీట్లకు గాను 19 సీట్లకు అభ్యర్థిత్వాలను పెండింగ్ లో పెట్టగా అందులో సత్తుపల్లి ఒకటి కావడం గమనార్హం. దీన్నిబట్టే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కు పోటీ ఎలా ఉందో తెలిసిపోతోంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో టికెట్ కు పోటీ బాగా పెరిగింది.

ఈ నలుగురిలో ఎవరికో?

నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఓయూ ఉద్యమ నేత, పీసీసీ సభ్యుడు మానవతారాయ్, గతంలో వైసీపీ తరఫున బరిలో దిగినా త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న మట్టా దయానంద్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు కొండూరు సుధాకర్.. వీరంతా సత్తుపల్లి టికెట్ ను ఆశిస్తున్నారు. వివిధ సమీకరణాల ప్రకారం మిగతా నేతలు ఆశలు పెట్టుకోగా.. సంభాని నేరుగా అధిష్ఠానం అండదండలతో టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు.

సత్తుపల్లిలో బోణీ కొట్టలేని సంభాని

1981లోనే పాలేరు ఉప ఎన్నికలో నెగ్గి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సంభాని.. 1989, 1999, 2004లోనూ అక్కడినుంచి నెగ్గారు. పాలేరు జనరల్ కావడం, సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో 2009 నుంచి ఇక్కడ పోటీచేస్తున్నారు. కానీ, ఇంతవరకు గెలుపు బోణీ కొట్టలేకపోయారు. వరుసగా మూడు సార్లు సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ తరఫున) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి సండ్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆయనను ఢీకొట్టేందుకు సంభాని సిద్ధమవుతున్నారు.

ఓయూ కోటాలో రాయ్ పట్టు

‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ నేతలకు రెండు సీట్లిస్తాం’’.. ఇదీ కాంగ్రెస్ అగ్ర నేత 2014 ఎన్నికల నుంచి ఇస్తున్న హామీ. కానీ, రెండు ఎన్నికలలోనూ దానిని ఆయన నిలుపుకోలేకపోయారు. ఈసారి మాత్రం సమీకరణాలు అనుకూలించాయని, పరిస్థితులు సీరియస్ గా మారడంతో ఓయూ ఉద్యమ నేతలకు టికెట్లు దక్కుతాయని నమ్మకం పెట్టుకున్నారు. ఈ కోటాలోనే పీసీసీ సభ్యుడు మానవతా రాయ్ సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్నారు. కాగా, ఓయూ నేతలు ఐదు స్థానాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కొల్లాపూర్, జనగామ, సత్తుపల్లి, మరో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ , ఓయూ నేతలకు ఎక్కడా టికెట్ దక్కలేదు. మిగతా చోట్ల అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి టికెట్ పై మానవతారాయ్ ఆశలు పెంచుకున్నారు.

మరి ఈ ఇద్దరి సంగతి..?

తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసిన 2014 ఎన్నికల్లో సత్తుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా మట్టా దయానంద్ సాధించిన ఓట్లు 72,434. దీన్నిబట్టే ఆయనకు ప్రజల్లో ఏమేరకు ఆదరణ ఉందో తెలుస్తోంది. అయితే, తదనంతర పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరారు దయానంద్. అక్కడా ఇమడలేక.. కాంగ్రెస్ లోకి వచ్చారు. గమనార్హం ఏమంటే.. మాజీ ఎంపీ పొంగులేటి కంటే ముందే మట్టా దయానంద్ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, ఇదే ఆయనకు ప్రతికూలంగా మారుతోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొంగులేటి తన ప్రధాన అనుచరుడైన కొండూరు సుధాకర్ కు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు నెల కూడా లేని సమయంలో.. ఈ నలుగురి మధ్య సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్